సింగరేణిలో స్కాములు ఇదిగో జాబితా: హరీష్‌ రావు

మాజీ మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌లను ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సిట్ ప్రశ్నించడంతో బీఆర్ఎస్‌ పార్టీ కూడా ఎదురుదాడి ప్రారంభించింది. హరీష్‌ రావు మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో వరుసగా కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయి. వందల కోట్లు చేతులు మారుతూనే ఉన్నాయి. 

దేశంలో ఒక మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తికి సగటున రూ.3 నుంచి 3.5 కోట్లు ఖర్చవుతుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోల్డి పవర్ కంపెనీకి భారీగా భూమి కూడా ఇచ్చి భూమి ఇచ్చి రూ.5 కోట్ల చొప్పున టెండర్ కట్టబెట్టింది. 107 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం మూడు ప్రాంతాలలో 35 మెగావాట్స్ చొప్పున మూడు ప్లాంట్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. 

కానీ చిన్న కంపెనీలు టెండర్లు వేయకుండా అడ్డుకునేందుకు, తమ వారికి కట్టబెట్టేందుకు మూడింటిని కలిపేసి ఒకేచోట 107 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి టెండర్లు పిలిచారు. దానిలో కూడా ఇతరులు ఎవరూ పాల్గొనకుండా ‘సైట్ విజిట్ సర్టిఫికేట్‌’ షరతు పెట్టి అడ్డుకుని తమ వారికి కట్టబెట్టారు. ఈ ఒక్క ప్రాజెక్టు ద్వారానే సుమారు రూ.200 నుంచి 250 కోట్లు లబ్ది కల్పించారు. 

జిలెటిన్ స్టిక్స్ కొనుగోలు కాంట్రాక్టులో తమ వారికి లబ్ది కలిగించేందుకు వాటి ధర సుమారు 30 శాతం పెంచితే సింగరేణి బోర్డులో ఇద్దరు డైరెక్టర్లు సంతకం పెట్టలేదు. వారిలో ఒకరు రాజీనామా చేసి వెళ్ళిపోతే మరొకరిని ఉద్యోగంలో రివర్షన్ ఇచ్చి జీఎం పదవికి దించేసి ఈ టెండర్లు కూడా తమ వారికి కట్టబెట్టేశారు. సింగరేణిలో ఇంత అవినీతికి పాల్పడుతూ, అవినీతికి పాల్పడటం లేదని తెలంగాణ గడ్డపై ఒట్టేసి చెప్పడానికి మీకు మనసెలా వచ్చింది?” అని హరీష్‌ రావు ప్రశ్నించారు.    

(Video  courtesy: Big TV Breaking News)