మున్సిపల్ ఎన్నికలలో జాగృతి సింహగర్జన

త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ జాగృతి పోటీ చేయడం లేదని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చెప్పారు. తాము రాజకీయపార్టీ ఏర్పాటు చేసుకోలేదు కనుక రాజకీయ పార్టీలు పాల్గొనే ఈ ఎన్నికలలో పోటీ చేయలేమని చెప్పారు.

కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (పార్టీ) ద్వారా అభ్యర్ధులను బరిలో దించేందుకు చర్చలు ముగిసినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ బీఫారం మీద దాని ఎన్నికల గుర్తు సింహంతో తెలంగాణ జాగృతి అభ్యర్ధులు బరిలో దిగబోతున్నట్లు సమాచారం. కల్వకుంట్ల కవితకు నిజామాబాద్‌లో మంచి పట్టు, బలం ఉంది కనుక అక్కడ 20 మందిని బరిలో దించబోతున్నట్లు తెలుస్తోంది. 

అలాగే జాగృతికి బలమున్న మరికొన్ని మునిసిపాలిటీలు, కార్పోరేషన్లలో కూడా బరిలో దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేయాలనుకుంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఎవరైనా తెలంగాణ జాగృతి మద్దతు కోరితే తప్పకుండా ఇస్తామని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. కనుక ఆవిధంగా వారిద్వారా కూడా తెలంగాణ జాగృతి ఈ ఎన్నికలలో తన సత్తా చాటుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. 

ఈ ఎన్నికలలో తెలంగాణ జాగృతి బరిలో దిగితే, అది ప్రధానంగా బీఆర్ఎస్‌ పార్టీ ఓటర్లపైనే ఆధారపడుతుంది. కనుక ఆ పార్టీ ఓట్లకు గండి పడుతుంది. ఒకవేళ ఈ ఎన్నికలలో తెలంగాణ జాగృతి భారీగా కాకపోయినా ఆశించినన్ని సీట్లు దక్కించుకోగలిగితే, బీఆర్ఎస్‌ పార్టీకి ప్రమాద ఘంటికలు మోగినట్లే.