వేమూరి రాధాకృష్ణకి భట్టి గట్టి వార్నింగ్

ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ వెనుక జరిగిన కధ ఇదీ అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్లో ‘తొలి పలుకు’ కార్యక్రమంలో ప్రసారమైన కధనంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మళ్ళీ నేడు ఘాటుగా స్పందించారు. “నేను 40 ఏళ్ళుగా ఎంతో నీతి నిజాయితీతో కష్టపడి పనిచేస్తూ ఈ స్థాయికి ఎదిగాను. నేను 40 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్న నా పరువు ప్రతిష్టలని వేమూరి రాధాకృష్ణ విషపు రాతలతో పోగొట్టేశారు. ఈ కధనం వెనుక ఏ దోపిడీదారులున్నారో, ఏ రాబందులు దాగి ఉన్నాయో నాకు తెలీదు. ఒక్క అవినీతి మరక లేని నన్ను ఈ రొచ్చులోకి ఎందుకు లాగారో కూడా నాకు తెలీదు.

కానీ మీరు వ్రాసిన ఈ రాతలతో నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది. కానీ ఇప్పటికీ మీరు నా గురించి వ్రాసిన అలాంటి తప్పుడు కధనానికి పశ్చాతాపం ప్రకటిస్తారని ఎదురుచూస్తూనే ఉన్నాను. కానీ మీ నుండి నేను ఆశించిన మాట రాలేదు.

కనుక ఓ సాధారణ పౌరుడుగా, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పటికైనా ఆ కధనంలో నా గురించి వ్రాసింది తప్పని అంగీకరిస్తూ మీ పత్రికలోనే ఓ ప్రకటన ఇవ్వండి. మీరు నా సహనం పరీక్షించవద్దు,” అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.