సిట్ అధికారులకే కేటీఆర్‌ ఎదురు ప్రశ్నలు?

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ శుక్రవారం సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సిట్ అధికారులు ఆయనని ప్రశ్నించారు.

కేటీఆర్‌ కూడా వారిని కొన్ని అంశాలపై ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేయించినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై అయన సిట్ అధికారులను వివరణ కోరినట్లు తెలుస్తోంది. కానీ అటువంటి సమాచారం ఏదీ తమ వద్ద లేదని వారు సమాధానం చెప్పిన్నట్లు తెలుస్తోంది. 

సిట్ అధికారులు కొందరు వ్యాపారుల ఫోన్ నంబర్లు ఎదురుగా పెట్టి వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారా? చేసి వారి నుంచి బలవంతంగా ఎలక్టోరల్ బాండ్లు ఇతర రూపాలలో బీఆర్ఎస్‌ పార్టీకి విరాళాలు సేకరించారా లేదా? అని అడిగినట్లు తెలుస్తోంది. వారి ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు తనకు తెలియదని కానీ రాజకీయ పార్టీలకు వ్యాపారులు విరాళాలు ఇవ్వడం సాధారణ విషయమేనని అని కేటీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. 

ఈ కేసులో ప్రధాన నిందితుడుగా పేర్కొనబడుతున్న ప్రభాకర్ రావుని నిబంధనలకు విరుద్దంగా ఎందుకు ఆ పదవిలో నియమించారు?ఎవరు నియమించారనే సిట్ అధికారుల ప్రశ్నకు అధికారుల నియామకాల్లో తనకు ఎటువంటి సంబంధమూ లేదని, ఆయన నియామకంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే సంబంధిత అధికారులే బాధ్యులని కేటీఆర్‌ చెప్పినట్లు తెలుస్తోంది. 

ఈ కేసులో ఏ-4గా ఉన్న రాధా కిషన్‌ని, కేటీఆర్‌ని ఎదురెదురుగా కూర్చోబెట్టి సిట్ అధికారులు ప్రశ్నించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అది వాస్తవం కాదని రాధా కిషన్‌ని, ఈ కేసులో పిర్యాదు చేసిన ఓ వ్యక్తిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

కేటీఆర్‌ విచారణ ముగిసిన తర్వాత అవసరమైతే మళ్ళీ పిలుస్తామని సిట్ అధికారులు చెప్పి పంపారు. ఈ కేసుని ప్రభావితం చేసే విధంగా మాట్లాడరాదని, ఎవరిపై ఒత్తిడి చేయరాదని చెప్పినట్లు తెలుస్తోంది.