సంక్రాంతి తరువాత తెరాస నేతలు జంప్?

ఈ సంక్రాంతి పండుగ తరువాత చాలా మంది తెరాస నేతలు, కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్వర్యంలో త్వరలోనే వరంగల్ లో బారీ బహిరంగ సభ నిర్వహిస్తామని దానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవుతారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 

రైతులకు నిరంతర ఉచిత విద్యుత్ పై పవన్ కళ్యాణ్ కు కనీస అవగాహన లేకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ ను అభినందించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఈ మూడున్నరేళ్ళలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి చేయకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడి నుంచి విద్యుత్ తీసుకువచ్చారో పవన్ కళ్యాణ్ ఆలోచించి ఉంటే బాగుండేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టుల వలననే నేడు కెసిఆర్ రైతులకు ఉచిత విద్యుత్ అందించగలుగుతున్నారని అన్నారు. 

ఈ ఉచిత విద్యుత్ సరఫరా గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ దీని వలన లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఇప్పుడు రేయింబవళ్ళు విద్యుత్ ఉంటుంది. ఎంత వాడుకొన్నా బిల్లు చెల్లించనవసరం లేదు కనుక రైతులు అవసరమున్నా లేకపోయినా బోరు మోటర్లతో నీళ్ళను తోడటం మొదలుపెడితే భూగర్భ జలాలు అడుగంటిపోతాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులకు కేవలం పగలు 9 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తే సరిపోతుందని సూచించారు.