లైంగిక వేధింపుల కేసులో ఈరోజు అరెస్ట్ అయిన ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ ను పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు ఈ నెల 12 వరకు రిమాండ్ విధించింది. పోలీసులు తక్షణమే ఆయనను చంచల్ గూడా జైలుకు తరలించారు. జైలు అధికారులు అయనకు ఖైదీ నెంబరు: 1327 ను కేటాయించారు. అయనకు రిమాండ్ విదించగానే అయన తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దానిపై విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఈ కేసులో భాదితురాలు కుమారి, గజల్ శ్రీనివాస్ వద్ద పనిచేస్తున్న పార్వతి అనే మరొక మహిళ చెపుతున్న మాటలు పూర్తి విరుద్దంగా ఉండటం విశేషం. గజల్ శ్రీనివాస్ తనను లైంగికంగా చాలా వేధించేవాడని భాదితురాలు చెప్పడమే కాకుండా అందుకు ఆడియో, వీడియో సాక్ష్యాధారాలు కూడా పోలీసులకు సమర్పించింది. అయన వద్ద చిరకాలంగా పనిచేస్తున్న పార్వతి మాత్రం గజల్ శ్రీనివాస్ అటువంటివాడు కాడని, మహిళల పట్ల చాలా గౌరవంగా ప్రవర్తిస్తారని చెపుతుండటం విశేషం. అయితే భాదితురాలు పోలీసులకు సమర్పించిన వీడియో సాక్ష్యాలు గజల్ శ్రీనివాస్ అనైతిక ప్రవర్తన కలిగి ఉన్నాడని నిరూపించేవిగా ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.