జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో రైతులందరికీ నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తునందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలపడంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అనూహ్యంగా స్పందించారు.
రేవంత్ రెడ్డి ఇవ్వాళ్ళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అనేది ఒక పెద్ద డ్రామా. మళ్ళీ దానికి అభినందనలు..పొగడ్తలా? ఇప్పుడు దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉన్నందున దేశంలో 19 రాష్ట్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా అవుతోంది. ఉదయ్ పధకంలో భాగంగా కేంద్రం నుంచి తెలంగాణాతో సహా పలు రాష్ట్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా అవుతోంది. మరి కెసిఆర్ కొత్తగా సాధించేదేమిటి? దానినే కదా అయన రైతులకు పంపిస్తున్నారు. ఈ మూడున్నరేళ్ళలో కొత్తగా ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కడైనా జరిగిందా? పవన్ కళ్యాణ్ కు ఈ విషయాలపై అవాగాహన పెంచుకొనే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తెలంగాణా విద్యుత్ కేటాయింపుల గురించి విద్యుత్ ఉద్యోగుల జెఏసి కన్వీనర్ రఘు ఒక పుస్తకం వ్రాశారు. దానిని పవన్ కళ్యాణ్ కు త్వరలోనే పంపిస్తాను. అది చదివితే ఆయనకే వాస్తవాలు ఏమిటో... ఉచిత విద్యుత్ పేరిట కెసిఆర్ రైతులను, ప్రజలను ఏవిధంగా మాయ చేస్తున్నారో అర్ధం అవుటుంది. నిజానికి రైతులకు 24గంటలు విద్యుత్ అవసరమే లేదు. పగటిపూట 9 గంటలు నిరంతరంగా ఇస్తే సరిపోతుంది. కానీ పగలు, రాత్రి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఎందుకు అంటున్నారంటే, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా చేస్తున్న పొరుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు అందించే కమీషన్లకు ఆశపడే! కనుక పవన్ కళ్యాణ్ నా సలహా ఏమిటంటే, కెసిఆర్ మాయలో పడొద్దని! కెసిఆర్ అవినీతికి పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారోద్దని!” అని అన్నారు.