ప్రముఖ గజల్ కళాకారుడు గజల్ శ్రీనివాస్ ను మంగళవారం ఉదయం పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నిర్వహిస్తున్న ‘ఆలయవాణి’ వెబ్ రేడియోలో జాకీగా చేస్తున్న పనిచేస్తున్న ఒక యువతి గజల్ శ్రీనివాస్ తనను గత కొంత కాలంగా వేధిస్తున్నారని పోలీసులకు పిర్యాదు చేసింది. అయన తనను వేధిస్తున్నట్లు నిరూపించే బలమైన ఆడియో, వీడియో ఆధారాలను ఆమె తమకు సమర్పించడంతో గజల్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశామని పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు.
అయితే తాను ఆమె పట్ల ఎన్నడూ అసభ్యంగా ప్రవర్తించలేదని, ఆవిధంగా ఆమె తనపై ఎందుకు పిర్యాదు చేసిందో అర్ధం కావడం లేదని గజల్ శ్రీనివాస్ పోలీసులతో అన్నారు. కొన్నాళ్ళ క్రితం తనకు యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి రోజూ మాలీష్ చేయించుకొంటున్నానని, ఒకరోజు మాలీష్ చేసే వ్యక్తి రాకపోవడంతో తనపై పిర్యాదు చేసిన యువతే తాను వద్దంటున్నా వినకుండా మాలిష్ చేసిందని గజల్ శ్రీనివాస్ పోలీసులకు తెలిపారు. అయితే ఆమె పట్ల తనకు ఎటువంటి దురుదేశ్యం లేదని చెప్పారు.
ఆ యువతి ఆయనకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు సమర్పించిందని అందుకే గజల్ శ్రీనివాస్ ను అరెస్ట్ చేశామని ఏసీపీ విజయ్ కుమార్ చెపుతుంటే, కేవలం ఆమె చేత మసాజ్ చేయించుకొన్నానని గజల్ శ్రీనివాస్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఒక మహిళ పరాయిపురుషుడిని బలవంతంగా బట్టలు విప్పించి మసాజ్ చేసిందంటే నమ్మశక్యంగా ఉందా? ఆలయవాణి పేరుతో లోకానికి నీతులు వల్లిస్తూ గజల్ శ్రీనివాస్ ఇటువంటి పరువు తక్కువ కక్కుర్తి పనులకు పాల్పడటం చాలా ఘోరం.