కెసిఆర్ ప్రసంగం అదుర్స్!

ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం కోకాపేటలో యాదవ, కుర్మ ప్రజల కోసం కమ్యూనిటీ హాల్, సంక్షేమ హాస్టల్ కు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అయన చేసిన ప్రసంగం చాలా స్పూర్తిదాయకంగా ఉంది. 

“తెలంగాణా రాష్ట్రానికి అద్భుతమైన మానవ వనరులున్నాయి. రాష్ట్రంలో 30 లక్షల మంది గొల్ల, కుర్మలున్నారు. 40 లక్షల మంది గంగపుత్రులున్నారు. అయినా గత ప్రభుత్వాలు వారిని పట్టించుకోకపోవడం వలన నేటికీ మనం ఇతర రాష్ట్రాల నుంచి రోజుకు 650 లారీల గొర్రెలు దిగుమతి చేసుకొంటున్నాము. వాటిలో ఒక్క హైదరాబాద్ నగరానికే రోజుకు 350 లారీల గొర్రెలు, 20-25 లారీల చేపలు వస్తున్నాయి. మన వద్ద ఇంతమంది గొల్ల, కుర్మలు, గంగపుత్రులున్నప్పటికీ మనం ఇంకా ఎందుకు ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలు, చేపలు దిగుమతి చేసుకోవాలి? మనమే ఇతర రాష్ట్రాలకు ఎందుకు ఎగుమతి చేయలేము? అని ఆలోచించి గొల్ల, కురుమలకు రాయితీ మీద గొర్రెలు పంపిణీ చేస్తున్నాము. అలాగే గంగ పుత్రుల కోసం పూడిక తీసిన చెరువులలో చేప పిల్లలను వదిలిపెడుతున్నాము. 

గొర్రెల పంపిణీ కోసం రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తున్నాము. ఇరురుగు పొరుగు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు 35 లక్షల గొర్రెలను తెచ్చి పంచి పెట్టగా వాటికి 13 లక్షల పిల్లలు పుట్టాయి. అంటే అప్పుడే మన రాష్ట్రంలో గొర్రెల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్న మాట. ఇదే విధంగా నిలకడగా అభివృద్ధి చెందితే, దేశంలో అత్యంత ధనికులైన గొల్ల, కుర్మలు మన రాష్ట్రంలోనే ఉన్నారని గర్వంగా చెప్పుకోగలుతాము. 

అయితే కొంతమంది వారికిచ్చిన గొర్రెలను అమ్ముకొంటున్నారని వింటున్నాను. ఆవిధంగా చేయడం సరికాదు. మనం బాగుపడటమే కాకుండా మన రాష్ట్రానికి, దేశానికి కూడా సంపద సృష్టించాలి. మనమే ఇతర రాష్ట్రాలకు గొర్రెలను చేపలను ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలి. కనుక ఇకపై ఎవరూ తమకు ఇచ్చిన గొర్రెలను అమ్ముకోమని ప్రతిజ్ఞ చేయాలి. గొల్ల, కుర్మలు తమకు ఇచ్చిన గొర్రెల  సంఖ్యను అభివృద్ధి చేసుకొంటే, ఇక్కడే అర్బన్ కేంద్రంలో మాంసం ప్రాసెస్ యూనిట్లను మీచేతే ఏర్పాటు చేయిస్తాను. గొల్ల,కుర్మలకు గొర్రెలు ఇచ్చి చేతులు దులుపుకోకుండా, వాటికి అవసరమైన వైద్య చికిత్సలు అందించేందుకు 100 మొబైల్ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నాము.        

ఈరోజు శంఖుస్థాపన చేస్తున్న ఈ భవనాలు మీ అభివృద్ధికి, సంక్షేమానికి నిలయాలుగా మారాలి. మీలో అనాధలు ఎవరున్నా వారికి ఇక్కడ వారికి ఆశ్రయం లభించాలి. వారి చదువులు, పెళ్ళిళ్ళు అన్నీ మీరే జరిపించే స్థాయికి ఎదగాలి. అందుకోసం నేను బిసి సంక్షేమ శాఖ నుంచి గొల్ల,కుర్మల మూలధనం నిధిగా కోటి రూపాయలు మంజూరు చేస్తాను. దానికి విదేశాలలో ఉన్న ప్రవాస తెలంగాణావాసులు కూడా యధాశక్తిన జోడించి మరింత అభివృద్ధి చేయాలి. ఆ నిధి గొల్ల,కుర్మల సంక్షేమానికి ఉపయోగపడాలి. మనం ఏదైనా ఒక పని ఆరంభించగానే సరిపోదు. అది పూర్తయ్యేవరకు పట్టినపట్టు విడువకుండా గట్టిగా పనిచేసి ఫలితాలు సాధించాలి. అప్పుడే మన బతుకులు బాగుపడుతాయి. మీ వెనుక నేనున్నాను. ప్రభుత్వం ఉంది. కనుక మీకు ఏ అవసరం వచ్చినా మీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లకు చెపితే మీ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాము,” అని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.