ఏపి, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించాలని తెరాస ఎంపిలు నిన్న ఇచ్చిన వాయిదా తీర్మానానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈరోజు లోక్ సభలో బదులిచ్చారు. ఏపి సిఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేసేందుకు నాలుగు భవనాలు సిద్దంగా ఉన్నాయని సూచించారని, వాటిని ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ పరిశీలించి నిర్ణయం తెలియజేసిన తరువాత ఏపి హైకోర్టును అక్కడికి తరలిస్తామని చెప్పారు. అయితే హైకోర్టును తరలించినప్పటికీ విభజన ప్రక్రియ పూర్తికావడానికి చాలా సమయం పడుతుందని కనుక రెండు రాష్ట్రాల అధినేతలు అంతవరకు పరస్పరం సహకరించుకోవాలని కోరారు. ఈ విభజన ప్రక్రియ పూర్తయ్యేవరకు పదోన్నతులు నిలిపివేయాలన్న తెరాస ఎంపి జితేందర్ రెడ్డి విజ్ఞప్తికి జవాబిస్తూ, నియామకాలు, పదోన్నతుల వ్యవహారాలు తమ పరిధిలో ఉండవని అది సుప్రీం కోర్టు కోలీజియం నిర్ణయిస్తుందని చెప్పారు.