అక్కడ కూడా అవినీతేనట!

తెలంగాణా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ, “తెరాస పాలనలో అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరుకొన్నాయి. సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణం కోసం ప్రతీ జిల్లాలో ప్రభుత్వ భూములు ఉండగా, కొందరు తెరాస నేతలకు లబ్ది చేకూర్చేందుకు వారికి బారీగా డబ్బు చెల్లించి భూములు కొనుగోలు చేసి అక్కడ వాటిని నిర్మిస్తున్నారు. దీనిపై మేము శాసనసభలో తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాము. 

ఇక మిషన్ భగీరథ వలన కేవలం పైపుల కంపెనీలకు, అవిచ్చే కమీషన్లతో తెరాస నేతలకు మాత్రమే ప్రయోజనం కలుగుతుంది తప్ప సామాన్య ప్రజలకు కాదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కోసం జిల్లాలో మొత్తం 11,000 మంది దరఖాస్తుచేసుకోగా వారిలో కేవలం 192 మందికి మాత్రమే మంజూరు చేసింది. ఇక గ్రామాల అభివృద్ధి, నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇస్తున్న నిధులు కూడా దుర్వినియోగమవుతున్నట్లు వింటున్నాము. కనుక ఆ నిధులను నేరుగాస్థానిక సంస్థలకే అందజేయాలి. 

తెరాస హయంలో రాష్ట్రం చాలా గొప్పగా అభివృద్ధి చెందిపోతున్నట్లు గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఆ అభివృద్ధి కళ్ళకు కనిపించదు. ఉదాహరణకు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నివారించేందుకు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్పుకొంటుంది. కానీ మూడున్నరేళ్ళు పూర్తవుతున్నా ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి కాలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడూ ప్రజలను మాయమాటలు చెపుతూ మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తుంటారని ప్రజలు కూడా గ్రహించారు. కనుక 2019 ఎన్నికలలో మా పార్టీయే గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం,” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.