మంత్రి కేటిఆర్ కు మరో అరుదైన గౌరవం

తెలంగాణా రాష్ట్ర మున్సిపల్, ఐటి మరియు పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్ కు మరో అరుదైన గౌరవం లభించింది. వచ్చే నెల స్విడ్జర్లాండ్ లో దావోస్ లో జరుగబోయే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనవలసిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. వీటికి సాధారణంగా కేంద్రమంత్రులను, ముఖ్యమంత్రులను మాత్రమే ఆహ్వానిస్తుంటారు. కానీ రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడానికి అయన చేస్తున్న కృషి, ఆ కారణంగా రాష్ట్రానికి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్ లో 1వ స్థానానికి చేరుకోవడం, ఆయన కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన ‘లీడర్ ఆఫ్ ది ఇయర్’ అందుకోవడం, ఇటీవల హైదరాబాద్ లో జిఈసిని ఆయన నిర్వహించిన తీరు మొదలైనవన్నీ పరిగణనలోకి తీసుకొని, కేటిఆర్ కు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఒక రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఈ సదస్సుకు ఆహ్వానించడం ఇదే మొదటిసారి. ఈ సదస్సులో ప్రపంచంలో అనేక దేశాల నుంచి సుమారు 2500 మందికి పైగా ఆర్ధిక, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, రాజకీయ రంగాలకు చెందినవారు హాజరవుతారు.

ఈ సదస్సులో పాల్గొనేందుకు తనకు ఆహ్వానం అందడంపై మంత్రి కేటిఆర్ సంతోషం వ్యక్తం చేస్తూ, “ఇది మన రాష్ట్రాభివృద్ధికి అంతర్జాతీయంగా లభించిన గుర్తింపుగా భావిస్తున్నాను. రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ సదస్సులో నేను తప్పకుండా పాల్గొని మన ప్రభుత్వ పాలసీలను, రాష్ట్రంలో వివిధ రంగాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, పరిశ్రమల స్థాపనకు అందిస్తున్న రాయితీల గురించి వివరిస్తాను,” అని చెప్పారు. 

మంత్రి కేటిఆర్ అందుకొంటున్న ఈ అవార్డులు, గౌరవం రాష్ట్రానికి లభిస్తున్న గుర్తింపు, గౌరవంగానే భావించాల్సి ఉంటుంది.  కనుక రాష్ట్రాభివృద్ధికి తెరాస సర్కార్ చేస్తున్నదేమీ లేదని విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్షాలకు ఈ అవార్డులు, ప్రత్యేక ఆహ్వానాలు చెంపదెబ్బ వంటివేనని చెప్పక తప్పదు. నిత్యం ప్రభుత్వ లోపాలను ఎట్టి చూపి విమర్శలు గుప్పించే ప్రతిపక్షాలు తెలంగాణా రాష్ట్రానికి లభిస్తున్న ఈ గుర్తింపు, గౌరవం గురించి మాట్లాడకపోవడం కూడా తప్పేనని చెప్పక తప్పదు.