వారి పోరుకు ముగింపు ఎప్పుడో?

అదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలకు, లంబాడీ ప్రజలకు మద్య జరుగుతున్న ఘర్షణలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలో కోలాంగూడలో రెండు వర్గాల మద్య మళ్ళీ నిన్న ఘర్షణలు జరిగాయి. ఒక ఆదివాసి రైతుకు, నలుగురు లంబాడీలకు మద్య చెరువు నీళ్ళ వాడకం గురించి గొడవ జరిగింది. ఆ ఘర్షణలో ఆదివాసి రైతుకు గాయలయ్యాయి. ఈ సంగతి తెలుసుకొన్న రాయికుంట, మామిడిపల్లి, లింగాపూర్, మైసంపేట తదితర గ్రామాల ఆదివాసీలు కర్రలు, కత్తులు పట్టుకొని కొలాంగూడలో లంబాడీల ఇళ్ళపై దాడి చేయడానికి వచ్చారు. అక్కడే ఉన్న మంచిర్యాల డిసిపి వేణుగోపాల్ రావు, ఏసిపిలు సీతారాములు, గౌస్ బాబా, సిఐలు నారాయణ్ నాయక్, ప్రమోదరావు తదితరులు వారికి చాలా సేపు నచ్చ చెప్పి శాంతింపజేయడానికి ప్రయత్నించారు కానీ వారి ఆగ్రహం చల్లార్చలేకపోయారు. దాంతో అక్కడకు చేరుకొన్న ఆదివాసీలు హటాత్తుగా కొత్తపేట లంబాడీ తండాపై విరుచుకుపడి, అక్కడి కిరాణా దుఖాణాలు, ఇళ్ళపై దాడి చేసి విద్వంసం సృష్టించారు. కనపడిన వాహనాలను ద్వంసం చేశారు. ఒక పశువుల కొట్టానికి నిప్పు పెట్టారు. వారు ఇంకా చెలరేగిపోక ముందే పోలీసులు వారిని చెదరగొట్టి వెనక్కు త్రిప్పి పంపించేయడంతో పరిస్థితులు మళ్ళీ అదుపులోకి వచ్చాయి. ప్రస్తుతం ఆ ప్రాంతాలలో బారీగా పోలీసులను మొహరించి ఉంచారు. లంబాడీల ఇళ్ళు, దుకాణాలపై దాడులు చేసిన ఆదివాసీలు, మళ్ళీ తమపై లంబాడీల దాడులను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా బంద్ కు పిలుపునీయడం విశేషం. 

మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే.ఆర్.వో. ఆర్.వి.కర్ణన్, ఆర్.డి.ఓ. శ్రీనివాస్ తదితరులు ఆదివాసీలతో మాట్లాడి వారికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరు తప్పు చేసినా పోలీసులకు, అధికారులకు పిర్యాదు చేయాలి తప్ప ఈవిధంగా దాడులకు పాల్పడటం సరికాదని హెచ్చరించారు. ఆదివాసి యువకుడు భీంరావుపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్షిస్తామని హామీ ఇచ్చారు. 

చిన్న చిన్న సమస్యలు కూడా ఘర్షణలకు దారి తీస్తుండటం గమనిస్తే ఈ ఘర్షణలు ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. కనుక జిల్లా అధికారులే మరింత చొరవ తీసుకొని వారిని శాంతపరిచేందుకు కృషి చేయాల్సి ఉంటుంది.