ఆరోజే నేరుగా మార్కెట్లోకి ‘కబాలి’ పాటలు

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కబాలి’ సినిమా ఆడియో ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలు సార్లు ఆడియో విడుదల కార్యక్రమం వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే జూన్ 12న కబాలి ఆడియో విడుదల కార్యక్రమాన్ని ఘనంగా, అభిమానులు సమక్షంలో చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్.

కబాలి ఆడియో వేడుకను నిర్వహించకుండా నేరుగా మార్కెట్లోకి ఆడియో విడుదల చేయనున్నారు. ఇందుకు గల కారణం రజనీకాంత్. ప్రస్తుతం రజనీకాంత్ అమెరికాలో వుండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారు. ఇక రజనీకాంత్ లేకుండా ఆడియో ఫంక్షన్ అంటే ఎవరు కూడా పట్టించుకోరు. అందుకే కబాలి ఆడియోను జూన్ 12న నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రపంచ వ్యాప్తంగా ఓ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అలాగే తాజాగా విడుదలైన పోస్టర్లు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కలైపులి.ఎస్.థాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రజనీకాంత్ సరసన రాధిక ఆప్టే హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా పలు భాషలలో విడుదల చేయనున్నారు.