
తెలుగు సినీ పరిశ్రమలో మంచిపేరు సంపాదించుకోవడంతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొంటున్న నటి అనసూయ. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకొందాం.
అనసూయ స్వస్థలం నల్గొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి. ఆమె 1985లో ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు. కానీ ఊహించని విదంగా వారి ఆర్ధిక పరిస్థితి తలక్రిందులవడంతో చాలా కష్టాలు అనుభవించవలసి వచ్చింది. ఎంతగా అంటే ఆమె తల్లి మిషన్‌పై బట్టలు కుట్టి కుటుంబాన్ని పోషించుకోవలసి వచ్చింది. అనసూయ అతికష్టం మీద ఎంబీయే (హెచ్ఆర్) చేసి ఓ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరాక మళ్ళీ వారి జీవితాలు మళ్ళీ మెల్లగా గాడిన పడ్డాయి. అక్కడే ఆమెకు పలువురు సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పాడ్డాయి. ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ సినిమాలలో చేసేందుకు భయపడి వచ్చిన ఆఫర్లను వదులుకొన్నారు.
ఆ తరువాత ఓ న్యూస్ రీడర్‌గా ఆ తరువాత ఈటీవీ జబర్దస్త్ షోలో యాంకర్‌గా మారడంతో చాలా పాపులర్ అయిపోయారు. అనసూయ అంత పాపులర్ అవడానికి ఆమె వాక్చాతుర్యం, చలాకీతనం కారణమనేవారు కొందరైతే ఆమె అందాల ప్రదర్శనే కారణమనేవారు చాలా మంది ఉన్నారు. ఎవరి అభిప్రాయాలూ ఎలా ఉన్నప్పటికీ ఆమె తన విమర్శకులందరికీ ‘రంగమత్త’గా గట్టిగా జవాబిచ్చారు. ఇప్పుడు ఆమె తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలలో నిర్భయంగా తనకు నచ్చిన పాత్రలను చేస్తూ అభిమానులను, విమర్శకులను కూడా మెప్పిస్తున్నారు.
ఇక ఆమె వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూస్తే...ఆమె భర్త పేరు సుశాంక్ భరద్వాజ్ ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు. ఫైనాన్స్, ఇన్వెస్ట్ మెంట్ ప్లానింగ్ బిజినెస్ చేస్తుంటారు. ఇంటర్ చదివే సమయం నుంచే వారి మద్య ప్రేమ మొదలైంది. కానీ అనసూయ తల్లితండ్రులు అంగీకరించకపోవడంతో తొమ్మిదేళ్ళు ఎదురుచూసి చివరికి వారి ఆమోదంతో 2010లో పెళ్లి చేసుకొన్నారు. అనసూయ, భరద్వాజ్ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆమె పాపులారిటీకి బహుశః ఇదీ ఓ కారణమై ఉండవచ్చనేవారు చాలా మంది ఉన్నారు. ఇద్దరు పిల్లల తల్లి…36 ఏళ్ళ వయసులో కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతుండటం సామాన్యమైన విషయం కాదు కదా? ప్రస్తుతం అనసూయ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.