కరోనాతో దర్శకుడు నంద్యాల రవి మృతి

తెలుగు సినీ దర్శకుడు నంద్యాల రవి (42) కరోనాతో మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించగానే పరీక్షలు చేయించుకొని కరోనా అని నిర్ధారణ కావడంతో ఆయన వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం కనుమూశారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకి చెందిన నంద్యాల రవి నేనూ సీతామహాలక్ష్మి, అసాధ్యుడు, పందెం సినిమాలకు కధ అందించారు. లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాతో దర్శకుడిగా మారారు. రాజ్‌తరుణ్ నటించిన ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమాకు నంద్యాల రవి కధ అందించారు. 

నంద్యాల రవికి భార్య, ఇద్దరు పిల్లలూ ఉన్నారు. చిరకాలంగా ఆయన సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేరే సమయానికి ఆయన ఆర్ధిక పరిస్థితి అంతగా బాగోకపోవడంతో కమెడియన్‌ సప్తగిరి, నిర్మాత రాధామోహన్ చెరో లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. త్వరలోనే కోలుకొని తిరిగివస్తారని భావిస్తే ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడవడంతో సినీ పరిశ్రమలో పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవలే సినీ జర్నలిస్ట్ టీఎన్ఆర్, అంతకు ముందు దర్శకుడు అక్కినేని వినయ్‌ కుమార్‌, సంగీత దర్శకుడు కేఎస్‌ చంద్రశేఖర్‌లను కరోనా మహమ్మారి కబళించింది. ఇప్పుడు యువ రచయిత, దర్శకుడు నంద్యాల రవిని కూడా కరోనా బలితీసుకొంది. ఈ వరుస మరణాలతో తెలుగు సినీ పరిశ్రమలో అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.