ఆక్సిజన్ కోసం సిక్కిం వెళ్ళిన గోపీచంద్

తెలుగు సినీ పరిశ్రమలో గోపీచంద్ మొదటి నుంచి కూడా కొంచెం విలక్షణమైన కధలు, పాత్రలు ఎంచుకొంటున్నారు. వర్షం, యజ్ఞం, ఆంధ్రుడు, రణం, మొగుడు, శౌర్యం, గోలీమార్, సాహసం వగైరా సినిమాలు అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో తన హీరోయిజంని ఎలివేట్ చేసే కాన్సెప్ట్, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవకుండా జాగ్రత్త పడుతుంటాడు. ప్రస్తుతం అతను చేస్తున్న ఆక్సిజన్ కూడా అటువంటి విభిన్నమైన కధాంశంతో కూడిన సినిమాయే. ఈ సినిమాలో గోపీ చంద్ సిక్కిం తీవ్రవాదులతో పోరాడే ఒక మిలటరీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అంటే ఎవరూ ఊహించని లోకేషన్స్, యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయన్నమాట!

ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో గోపీ చంద్ తో అను ఇమ్మాన్యుయల్ జత కడుతోంది. ఈ సినిమాలో జగపతిబాబు ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. చంద్రమోహన్, అలీ, బ్రహ్మాజీ, షాయాజీ షిండే, అభిమన్యు సింగ్, ప్రభాకర్, అమిత్, కిక్ శ్యాం,  రాశిఖన్నా, సితార తదీతరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సిక్కింలో సాగుతున్న ఈ షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోతుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు కూడా సమాంతరంగా సాగుతున్నాయని నిర్మాత ఎస్. ఐశ్వర్య తెలిపారు. ఈ సినిమా ఆడియోని వచ్చేనెల మొదట్లో విడుదల చేసి దసరా రోజున సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ సినిమాకి సంగీతం: యువన్ శంఖర్ రాజా, కెమెరా: వెట్రి, ఫైట్స్: పీటర్ హెయిన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి అందిస్తున్నారు. శ్రీ సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి స్పందనే వచ్చింది కనుక దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి గోపీచంద్ ఆ అంచనాలని అందుకొని ప్రేక్షకులని మెప్పిస్తారో లేదో చూడాలి.