సునీల్ దసరాకి పెద్ద సాహసమే చేస్తున్నాడు

హీరోగా స‌క్సెస్ ట్రాక్ ఎక్కేందుకు సునీల్ చాలా కష్టపడుతున్న చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సునీల్ హీరోగా వ‌చ్చిన గ‌త చిత్రాలు ఆశించిన హిట్ అందించ‌లేక‌పోయాయి. క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డంలో సునీల్ త‌డ‌బ‌డుతున్నాడ‌ని కొంత‌మంది విశ్లేషిస్తున్నారు. పాత త‌ర‌హా క‌థ‌ల్ని ఆశ్ర‌యించ‌డం వ‌ల్ల‌నే సునీల్ హిట్ కొట్ట‌లేక‌పోతున్నాడ‌న్న విమ‌ర్శ ఉంది. పైగా, త‌న బాడీ లాంగ్వేజ్‌కు స‌రిపోని క‌థల వెంట అత‌డు ప‌రుగులు తీస్తూ ఉండ‌టం త‌గ్గించుకుంటే బాగుంటుంద‌నీ, కొత్త త‌ర‌హా క‌థాక‌థ‌నాల‌ను ఆశ్ర‌యిస్తే బాగుంటుంద‌ని ఆశిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన జ‌క్కన్న చిత్రం పెద్ద‌గా ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకోలేదు! త్వ‌ర‌లో ‘ఈడు గోల్డ్ ఎహే’ అనే చిత్రంలో ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి వీరు పోట్ల ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌లై చాలా రోజులైంది.

అయితే, ఈ చిత్రం కూడా గ‌త చిత్రాలు మాదిరిగానే రొటీన్‌గా ఉండేట్టుగానే క‌నిపిస్తోంది. క‌థ‌లో ఏముందో తెలీదుగానీ… ఈ చిత్రాన్ని ద‌స‌రా బ‌రిలోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ద‌స‌రా విడుద‌ల కోసం ప్రేమ‌మ్‌, ఇజం, అభినేత్రి, మ‌న ఊరి రామాయ‌ణం వంటి చిత్రాలు సిద్ధ‌మౌతున్నాయి. ఇంత ఫ్లోటింగ్ మ‌ధ్య‌లోకి సునీల్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. అయితే, గ‌త చిత్రాలు నిరాశప‌ర‌చిన ట్రాక్ ఉన్న‌ప్పుడు… అన్ని సినిమాల మ‌ధ్య‌లో పోటీప‌డ‌టం ఎంత‌వ‌ర‌కూ స‌రైన స్ట్రాట‌జీ అవుతుందో అనేది కొంత‌మంది అనుమానం! ద‌స‌రా మీద మోజుతో ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారో.. లేదా, అన్ని సినిమాల మ‌ధ్య స‌త్తా చాటుకుంటుంద‌న్న న‌మ్మ‌క‌మో… ఏదేమైనా సునీల్ కెరీర్‌కు అత్యంత కీల‌క‌మైన ఈ చిత్రం విడుద‌ల విష‌యంలో ఇది సాహ‌సం అవుతుందేమో..?