
నందమూరి బాలకృష్ణ, శ్రీయ జంటగా నటిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని బాలకృష్ణ తల్లిగా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ కంటే ఆమె వయసులో 11 ఏళ్ళు పెద్దది కావడం, శాతకర్ణి తల్లి పాత్రకి అవసరమైన వయసు, రాజసం ఆమెలో ఉండటంతో ఆమెని ఈ సినిమాలో తీసుకోగా, ఆమె ఈరోజు నుండి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ జరుగుతుండగా, అక్కడే ఏకధాటిగా మూడు వారాలు షూటింగ్ చేస్తారు. ఈ షెడ్యూల్ లో రాజమహల్ లో బాలకృష్ణ, హేమమాలిని, శ్రీయ తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలని షూట్ చేస్తారు. ఆ తరువాత హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్స్ లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది.
ఈ సినిమా బాలకృష్ణకి 100వ చిత్రం కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా, తన సినీ జీవితంలో మరో గొప్ప మైలురాయిగా నిలుస్తుందని బాలకృష్ణ గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ రోజుల్లో ఇటువంటి చారిత్రాత్మక కధాంశం కలిగిన సినిమాలు, అది కూడా బాలకృష్ణ లాంటి అగ్ర హీరో నటిస్తే, ఎంతవరకు ప్రజలను ఆకట్టుకుంటాయనేది ప్రశ్నగా మారింది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకి రిలీజ్ చేయబోతున్నారు.
ఫస్ట్ ఫ్రేం ఎంటర్టెయిన్మెంట్ బ్యానర్ క్రింద నిర్మిస్తున్న ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తే, సంగీత దర్శకుడిగా మొదట దేవి శ్రీ ప్రసాద్ ని అనుకున్నా, ఇప్పుడు ఆయన్ని తప్పించేశారు. మరొకరిని ఖరారు చేయవల్సి ఉంది.