
గ్యాంగ్ స్టార్ నయీం ఎన్కౌంటర్ తరువాత అతని నేరాలకి సంబంధించి రోజుకొక కొత్త విషయం బయట పడుతోంది. అతని క్రైం స్టోరీస్ ని చూస్తే అవన్నీ రాయడానికి ఒక పుస్తకం కూడా సరిపోదని స్పష్టం అవుతోంది. సినిమాగా తీద్దామన్నా అది ఒక పార్ట్ లోనే తీయడం సాధ్యం కాదని, కనీసం మూడు పార్టులుగా తీయవలసి ఉంటుందని అందుకు సిద్ధమవుతున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ చెప్పడం గమనిస్తే నయీం క్రైం-గ్రాఫ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆ సినిమా మొదలు పెట్టే లోగా నయీం ఆగడాలు, రాజకీయ, సినీ ప్రముఖులతో అతనికున్న పరిచయాల గురించి మరిన్ని కొత్త విషయాలు బయటపడవచ్చు కనుక రాంగోపాల్ వర్మ నయీంపై సినిమా నిర్మించడం కంటే ఓ రెండు మూడొందలు ఎపిసోడ్స్ తో సీరియల్ నిర్మిస్తే మంచి హిట్ అవుతుందేమో?
నయీం ఆగడాల గురించి భువనగిరికి చెందిన నరహరి అనే ఒక వ్యాపారి ఈరోజు పోలీసులకి తన ఘోడు మోరపెట్టుకొన్నాడు. నయీం తనని రూ.2కోట్లు డిమాండ్ చేశాడని, కానీ అతి కష్టం మీద రూ.25 లక్షలకి అతనిని ఒప్పించుకొని బయటపడ్డానని చెప్పాడు. ఆ కారణంగా తను ఆర్ధికంగా చాలా దెబ్బతిన్నానని చెప్పుకొని బాధ పడ్డాడు. రానున్న రోజులలో బహుశః ఇటువంటి నయీం బాధితులు చాలా మంది మీడియా ముందుకో, పోలీసుల వద్దకో వెళ్లి తమ ధీన గాధలని మొరపెట్టుకోవచ్చు. జిల్లాలో ఇంత అశాంతి, అరాచక వ్యవస్థ నెలకొని ఉంటే మరి రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నాయో, ఇంతవరకు నయీంని ఎందుకు ఉపేక్షించాయో వాటికే తెలియాలి.
నయీం బాధితుల గోడుని ప్రభుత్వం పట్టించుకోకపోయినా, వినేందుకు రాం గోపాలవర్మ సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే, ఆయనకీ అటువంటి క్రైం, హర్రర్ సబ్జెక్ట్స్ అంటే చాలా ఇష్టం. వాటిపైనే సినిమాలు తీయడానికి ఇష్టపడతానని కుండబద్దలు కొట్టినట్లు చాలాసార్లు చెప్పారు కనుక, నయీంపై తను తీయబోయే సినిమాలో మూడు భాగాలు ఉంటాయని రాం గోపాలవర్మ ప్రకటించారు. నయీం ఆవిర్భావం నుంచి ఎన్ కౌంటర్ వరకు అన్నిటినీ వాటిలో చూపిస్తానని రాం గోపాలవర్మ చెప్పారు. నయీం వలన బాధపడిన వారిని, నష్టపోయిన వారిని, చివరికి ప్రాణాలు కోల్పోయినవారినే ఇంతవరకు చూశాము తప్ప నయీం వలన లాభపడినవారిని చూడలేదు. కనుక అందరూ నయీం వలన బాధలు పడితే రాం గోపాలవర్మ మాత్రం నయీంపై బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకోబోతున్నారన్నమాట..గ్రేట్!