చిరంజీవి ఎంట్రీతో తెలుగు సినీపరిశ్రమ ఎఫెక్ట్ అవుతుందా?

సుమారు 9సం.ల సుధీర్గ విరామం తరువాత చిరంజీవి మళ్ళీ సినీపరిశ్రమలోకి ఖైదీ నెంబర్:150గా రీ-ఎంట్రీ ఇస్తున్నారు. కనుక ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా కధ దగ్గర నుంచి టైటిల్ వరకు ఆయన తీసుకొన్న జాగ్రత్తలు కొంచెం అతిగా ఉన్నా, అవన్నీ ఆ సినిమా హిట్ అవడానికి దోహదపడేవే కనుక ఎవరూ వేలెత్తి చూపలేరు. కనుక ఆ సినిమా తప్పకుండా హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ సినిమా సూపర్ హిట్ అయితే, తెలుగు సినీపరిశ్రమలో మళ్ళీ ‘మెగాశకం’ మొదలవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి సుమారు ఒక అరడజను మంది హీరోలు తెలుగు సినీ పరిశ్రమని ఏలేస్తున్నారు. వారికి మెగాస్టార్ కూడా తోడయితే ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారి కుటుంబమే పూర్తి డామినేషన్ అవుతుంది. ఒకప్పుడు మోహన్ బాబు, డా.రాజశేఖర్ వంటి అనేకమంది హీరోలు మెగాస్టార్ తో పోటీ పడలేక వెనుకబడిపోయారు. కానీ చిరంజీవి రాజకీయాలలోకి వెళ్ళిన తరువాత మళ్ళీ చిన్నా, పెద్ద హీరోలు అందరూ బాగా నిలదొక్కుకోగలిగారు.

రామ్ చరణ్ తేజ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్. అల్లు శిరీష్ వంటివారు తమ సత్తా చాటుకొంటున్నప్పటికీ, వారి ప్రభావం మిగిలిన చిన్నాపెద్ద సినిమాలపై, హీరోలపై పెద్దగా పడలేదు.అందుకే ఈ తొమిదేళ్ళలో అనేక చిన్న నిర్మాతలు, దర్శకులు, సినిమాలు, హీరోలు పైకి వచ్చి తమ ఉనికిని చాటుకోగలిగారు. కానీ ఇప్పుడు మెగాస్టార్ వరుసగా సినిమాలు చేయడం మొదలుపెట్టి, మార్కెట్ పై పట్టు సాధిస్తే మళ్ళీ వారందరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే ఊహించడం కష్టం.

మెగా హీరోల సినిమా విడుదలవుతోందంటే అభిమానులకి పండగ కానీ, చిన్న సినిమాల నిర్మాతలకి గుండెల్లో గుబులు మొదలవుతుంటుంది. ఎందుకంటే వారి సినిమాలు వేసుకొనేందుకు థియేటర్లు దొరకవు. దొరికినా ఎక్కువ రోజులు ఉంచరు. దానితో చిన్న సినిమాలు ఎంత గొప్పగా తీసినా నిర్మాతలు నష్టపోక తప్పడం లేదు. ఆ కారణంగా ఆ సినిమాలలో నటించిన హీరోలు కూడా అనామకులుగా మిగిలిపోవలసి వస్తోంది. మరిప్పుడు మెగా స్టార్ కూడా వరుసగా సినిమాలు చేయడం మొదలపెడితే వారందరి పరిస్థితి ఎలాగుంటుందో చూడాలి.