డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అనుమానాస్పద మృతి

తెలుగు చలనచిత్ర రంగ అసిస్టెంట్ డైరెక్టర్ విక్రమ్ చైతన్య మృతి అనుమానాస్పదంగా మారింది. హైదరాబాద్ మూసాపేట్‌లోని రెయిన్‌బో విస్టా అపార్ట్‌మెంట్ రెండో అంతస్తుపై నుంచి దూకి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులకు గురైన అయన అత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నా.. అయన కుటుంబసభ్యులు మాత్రం మృతిలో మిస్టరీని దాగివుందని అనుమానిస్తున్నారు. ఈ మృతి వెనుక మిస్టరీని చేధించాలని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కూకట్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన విక్రమ్ (32) తల్లి విజయలక్ష్మి, తమ్ముడు వివేక్‌తో కలిసి రెయిన్‌బో అపార్టుమెంట్‌లోని 210 ప్ల్లాట్‌లో నివసిస్తున్నాడు. డైరెక్టర్ సుకుమార్ వద్ద నాన్నకు ప్రేమతో, నేనొక్కడినే వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆదివారం ఇంటి నుంచి బయటకెళ్లిన విక్రమ్ సమీపంలోని ఓ బార్‌లో స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. 

రాత్రి 9 గంటలకు బార్ నుంచి బయటకొచ్చి స్నేహితులకు ఇంటికి వెళుతున్నానని చెప్పి వెళ్లాడు. అర్ధరాత్రి మూడుగంటల ప్రాంతంలో రాత్రి గస్తీ తిరిగే సెక్యూరిటీ సిబ్బంది అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో విక్రమ్ మృతదేహం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నా విక్రమ్ స్పందించలేదని ఆయన తల్లి తెలిపింది. కొంతకాలంగా విక్రమ్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని విచారణలో తేలింది. మరి ఆత్మహత్యకు ఆ ఆర్థిక ఇబ్బందులా? మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.