నటికి చుక్కలు చూపించిన నెటిజన్లు

తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అన్నట్లుంది ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రమ్య వ్యవహారం. పాకిస్తాన్ కు అనుకూలంగా అమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కన్నడ రాజకీయాలలో పెను దుమారం రేపుతున్నాయి. నటి రమ్య పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలో మండ్యలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...‘ పాకిస్తాన్‌కు వెళితే నరకానికి వెళ్లినట్లు అని రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పారికర్ పేర్కొనడం సరికాదని అన్నారు. 

ఇంత వరకు బాగానే వున్నా ఇక్కడే అసలు ట్విస్టు వచ్చింది. అంతటితో ఆగని రమ్య మనం ఇక్కడ ఎలా నివసిస్తున్నామో అక్కడి ప్రజలు కూడా అలాగే నివసిస్తున్నారు. పాకిస్థాన్‌లో పరిస్థితులు బాగున్నాయని, అది చాలా మంచి దేశమని కితాబిచ్చారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు, పాకిస్థాన్‌కు వెళ్తే నరకానికి వెళ్లినట్లు ఉంటుందని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలను, ఆమె ఈ సందర్భంగా ఖండించడంపై విమర్శలు పెల్లుబిక్కాయి.  

రమ్య వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు, పలు స్వచ్ఛంద సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, ఆమె వ్యాఖ్యలు సరికాదని ధ్వజమెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై మండిపడుతున్నారు. తీవ్ర విమర్శల నేపథ్యంలో రమ్య ట్విట్టర్లో స్పందించారు. తాను ప్రధాని మోడీని వ్యతిరేకించలేదన్నారు, కానీ కొన్ని అంశాలలో తాను విభేధించానన్నారు. పాకిస్తాన్‌లో తమలాంటి ప్రముఖులను బాగా చూసుకున్నారని మాత్రమే తాను చెప్పానని అన్నారు.