ఫిలింనగర్ లో విషాదం

హైదరాబాద్ జుబ్లీహిల్స్‌లోని ఫిలిం నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన ఇద్దరు ఆనంద్, హమీద్ షేక్. బాధితులంతా బెంగాల్ వాసులు. మరో పది మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకేసారి ఎనిమిది పిల్లర్లు కూలినట్లు చెబుతున్నారు. మొత్తం పద్నాలుగు పిల్లర్లు నేలమట్టం అయ్యాయి. 

ప్రమాదంలో గాయపడిన పదిమంది కూలీలను అపోలో ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద కూలీలు ఉన్న నేపథ్యంలో కాంక్రీట్ స్లాబులను పగలగొడుతున్నారు. ఈ భవనం కూలిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. కాగా, ఈ భవనాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ సాంస్కృతిక సంఘం ఫిలింనగర్ కల్చరల్ అసోసియేషన్ స్వయంగా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. భవన నిర్మాణంలో నాసిరకం సిమెంటును వాడటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అదే సమయంలో రెండు వారాల వ్యవధిలో రెండు ఫ్లోర్లను ఇక్కడ వేయడం, ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో నిర్మాణం చేపట్టడం వల్ల కుప్పకూలినట్లుగా భావిస్తున్నారు.