ఇక ప్రతీ ఏటా రెండు రోజులు మహాసభలు

ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన ప్రపంచ తెలుగు మహాసభలు నిన్నటితో ముగిసాయి. ఆ ముగింపు కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా తెలుగు బాష గొప్పదనం గురించి చెప్పడం విశేషం. ఇక ఈ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

“తెలుగు గడ్డపై తెలుగు బాషను బ్రతికించుకోవాలని లేదా కాపాడుకోవాలనే మాటలు వింటుండటం నాకు చాలా బాధ కలిగించింది. ఈ మహాసభల ముగింపు రోజున తెలుగు బాషాభివృద్ధికి కొన్ని నిర్ణయాలు ప్రకటిద్దామని భావించాను. అయితే, ఈ ఐదు రోజుల మహాసభలలో తెలుగు బాషాభివృద్ధికి అనేక వందల మంచి సలహాలు, సూచనలు వచ్చాయి. కనుక ఇప్పటికిప్పుడు ఏవో కొన్ని నిర్ణయాలు ప్రకటించడం కంటే వాటిపై వచ్చే నెలలో తెలుగు బాషా, సాహితీవేత్తలతో లోతుగా చర్చించి, వారి సూచనలు, సలహాల మేరకు తెలుగు బాషాభివృద్ధికి తగిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించాను. కానీ ఈ మహాసభల ముగింపు సందర్భాన్ని పురస్కరించుకొని ఒక ప్రకటన చేయదలచుకొన్నాను. ఇకపై ప్రతీ ఏటా డిసెంబర్ నెలలో రెండు రోజులు తెలంగాణా తెలుగు మహా సభలు జరపాలని నిర్ణయించుకొన్నాను,” అని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. 

కెసిఆర్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, “తెలుగు బాషాభివృద్ధి కోసమే రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వరకు తెలుగు బాషను తప్పనిసరి చేశాము. ఈ రాష్ట్రంలో చదువుకోవాలనుకొనేవారు ఎవరైనా సరే తప్పనిసరిగా తెలుగు బాషను నేర్చుకోవలసిందే. ఐదు రోజులపాటు ఏదో మొక్కుబడిగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిపి చేతులు దులుపుకోకుండా, తెలుగు బాషాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను చేపడతాము. రాష్ట్రంలో బాషా పండితులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాము. పదవీ విరమణ చేసిన బాషా పండితుల పించన్ లలో కోత విధిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. దానిని రద్దు చేస్తాను. ఈ మహాసభలలో తెలుగు బాషకు పట్టాభిషేకం చేసిన అనుభూతి నాకు కలిగింది. దేశ విదేశాల నుంచి తెలుగు బాషా సాహిత్యవేత్తలను, కళాకారులతొ బాటు ఇతర బాషలలో ప్రముఖ సాహితీవేత్తలను, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీతలను, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలను కూడా ఆహ్వానించి వారినీ ఘనంగా సన్మానించుకొన్నాము. ముఖ్యంగా ఈ మహాసభలలో తెలంగాణా సాహిత్య విశిష్టత, దాని వైభవం, కళా వైభవం ప్రపంచానికి చాటి చూపగలిగాము. తెలంగాణా రాష్ట్రంలో గుర్తింపుకు నోచుకోక మరుగునపడిన వందలాది సాహిత్యకారులను, కళాకారులను ఈ మహాసభల ద్వారా లోకానికి చాటి చూపగలిగాము. ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించే శక్తి సామర్ధ్యాలు తెలంగాణావారికి ఉన్నాయో లేవో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో, అందరం కలిసికట్టుగా పనిచేసి అత్యద్భుతంగా నిర్వహించి చూపాము. అందుకు నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. తెలుగు బాషాభివృద్ధి పట్ల మన ప్రభుత్వానికి ఎంత నిబద్దత ఉందో ఈ మహాసభల నిర్వహణ ద్వారా చాటి చూపగలిగాము. ఈ మహాసభలు ఇంత గొప్పగా జరగడానికి, విజయవంతం కావడానికి కారకులైన తెలంగాణా సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డిగారికి, ఆయన బృందానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి సింగ్, డిజిపి ఎం.మహేందర్ రెడ్డి, సాంస్కృతిక శాఖ చైర్మన్, కార్యదర్శి, ఇతర అధికారులు, ఉద్యోగులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను,” అన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్.

“ఈ మహాసభల ప్రారంభోత్సవం రోజున నేను చదివిన రెండు తెలుగు పద్యాలను అందరూ మెచ్చుకొన్నారు. కనుక ఈ హాయిగా సంతోషంగా నవ్వుకొంటూ ఈ  మహాసభలను ముగిస్తూ మరో పద్యం చెపుతాను,” అంటూ ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్రం ఝాషువా రచించిన ఒక చక్కటి పద్యాన్ని చదివారు. 

‘నవ్వవు జంతువుల్..నరుడు నవ్వును 

నవ్వులు చిత్తవృత్తికిన్‌ దివ్వెలు 

కొన్ని నవ్వులెటు తేలవు 

కొన్ని విష ప్రయుక్తముల్‌.. 

పువ్వుల వోలే ప్రేమ రసమును విరజిమ్ము విశుద్ధములైనవే నవ్వులు... 

సర్వ దుఃఖ దమనములు వ్యాధులకైన మహౌషధమ్ముల్‌’