సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం మంగళవారం ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ కాంగ్రెస్, తెరాస, భాజపా అన్నీ ఒక్క తానులో ముక్కలేనని కనుక వాటికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో గల 31 పార్టీలను కలుపుకొని ‘బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్’ ను ఏర్పాటుచేస్తున్నట్లు లో ప్రకటించారు. తెలంగాణాలో తెరాస, కాంగ్రెస్ పార్టీలకు ఏకైక ప్రత్యామ్నాయం తామేనని తమ్మినేని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలలోను తమ ఫ్రంట్ పోటీ చేస్తుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు దెబ్బ తిన్నప్పటికీ భారత్ లో మాత్రం బలంగా ఉన్నాయని, తెలంగాణా రాష్ట్రంలో ఇంకా బలంగా ఉన్నాయని కనుక రాష్ట్రంలో వామపక్షాలు తమ సత్తా చూపవలసిన సమయం ఇదేనని అన్నారు. అయితే తమ ఫ్రంట్ లో చేరేందుకు సిపిఐ నిరాకరించిందని, భవిష్యత్ లో అది కూడా చేరుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో సామాజిక న్యాయం సాధించడం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి తమ ఫ్రంట్ ప్రధాన లక్ష్యాలని చెప్పారు. తెరాస సర్కార్ నిరకుమ్ష ధోరణితొ ప్రజలు విసుగెత్తిపోయున్నారని కనుక వచ్చే ఎన్నికలలో వారు తప్పకుండా తమ ఫ్రంట్ ను గెలిపిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.
గుజరాత్ లో భాజపా విజయంపై స్పందిస్తూ, “ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా నేతలు గొప్పగా చెప్పుకొంతున్నట్లుగా గుజరాత్ ప్రజలు మోడీకి బ్రహ్మరధం పట్టలేదు. ఒకవేళ పట్టి ఉండిఉంటే ఇదివరకు 165 స్థానాలు గెలుచుకొన్న భాజపా ఈసారి ఎన్నికలలో కేవలం 99స్థానాలు మాత్రమే ఎందుకు గెలుచుకొంది? భాజపా గెలిచినప్పటికీ, ఈ ఎన్నికలలో అది సాధించిన సీట్లు దానిపై నానాటికీ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు అద్దంపడుతోంది,” అని తమ్మినేని వీరభద్రం అన్నారు.