మావోయిస్టులపై డిజిపి అనుమానం!

అదిలాబాద్,  కుమురం భీం జిల్లాలలో ఆదివాసీలకు, లంబాడీలకు మద్య మావోయిస్టులు చిచ్చు రగిలించి ఉండవచ్చనే డిజిపి ఎం.మహేందర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అయన నిన్న హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో ఉట్నూరు వెళ్ళి అక్కడ జరిగిన విద్వంసాన్ని స్వయంగా పరిశీలించారు. తరువాత  రెండు జిల్లాల డిఐజి, ఎస్పి, సిఐ పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఆదివాసీలు, లంబాడీలు చిరకాలంగా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారు. వారిమద్య చిచ్చు రగిల్చి జిల్లాలలో శాంతిభద్రతల సమస్యలను సృష్టించేవారు ఎవరైనా ఉపేక్షించబోము. ఈ ఆందోళనలను అడ్డుపెట్టుకొని మావోయిస్టులు, మాజీ మావోయిస్టులు, మాజీ మిలిటెంట్లు శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తే వారి పట్ల కటినంగా వ్యవహరిస్తాము. ప్రజలు కూడా అటువంటివారిని దూరంగా ఉంచాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

రెండు జిల్లాలలో ఆదివాసీలకు, లంబాడీలకు మద్య పెరుగుతున్న ఉద్రిక్తతలను సకాలం గుర్తించి అదుపు చేయడంలో విఫలమైనందుకు, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్  జిల్లాల కలెక్టర్లపై, ఎస్పిలపై ప్రభుత్వం బదిలీలు చేసింది. 

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జ్యోతీ బుద్ధ ప్రకాష్ స్థానంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ డి.దివ్య నియమించబడ్డారు. అదిలాబాద్ ఎస్పి ఎం.శ్రీనివాసులు స్థానంలో నిర్మల్ ఎస్పి ఎస్.విష్ణు వారియర్ కు అధనపు బాధ్యతలు అప్పగించింది. 

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ చంపాలాల్ స్థానంలో వరంగల్ రూరల్ కలెక్టర్ పాటిల్ ప్రశాంత్ జీవన్ నియమించబడ్డారు. అలాగే జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ స్థానంలో నాగర్ కర్నూల్ ఎస్పి కల్మేస్వర్ శింగన్ వార్ ను నియమించబడ్డారు. 

బదిలీవేటు వేయబడిన వారిలో ఆసిఫాబాద్ ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఒక్కరికే నాగర్ కర్నూల్ కు బదిలీ చేయగా మిగిలిన వారినందరినీ డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలువవలసిందిగా ఆదేశించడం గమనిస్తే రెండు జిల్లాలలో జరిగిన సంఘటనల పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా ఆగ్రహంగా ఉన్నట్లు అర్ధమవుతోంది.