గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజే వెలువడబోతున్నాయి. రెండు రాష్ట్రాలలో ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది కనుక మధ్యాహ్నం 11-12 గంటలలోపే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచిందో తేలిపోబోతోంది.
కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలు తేల్చి చెప్పాయి. భాజపా పాలిత గుజరాత్ లో మళ్ళీ భాజపాయే గెలిచి అధికారం నిలబెట్టుకొనే అవకాశాలున్నట్లు సర్వేలు చెపుతున్నాయి. అయితే ఈసారి గుజరాత్ లో భాజపాకు వ్యతిరేక రాజకీయవాతావరణం ఏర్పడినందున, కాంగ్రెస్, భాజపాలు రెంటికీ విజయావకాశాలు సమానంగానే ఉండవచ్చు. ఒకవేళ భాజపా గెలిచినప్పటికీ బొటాబొటి మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పోలింగ్ ముందురోజు వరకు ఈసారి కాంగ్రెస్ పార్టీ చేతిలో భాజపా ఓడిపోవడం తధ్యం అని గట్టిగా వాదించిన హార్దిక్ పటేల్, పోలింగ్ ముగియగానే చేసిన ఆరోపణ విన్నట్లయితే కాంగ్రెస్ ఓడిపోబోతోందనే భయం కనిపిస్తోంది. “భాజపాకు చెందిన హ్యాకర్స్ ఓట్ల లెక్కింపు సమయంలో ఈవిఎంలను వైఫీ ద్వారా హ్యాకింగ్ చేసే ప్రమాదం ఉంది” అని ఆరోపించారు. నిజానికి ఈవిఎం మెషిన్లకు వైఫీకి సంబంధమే లేదు. అయినప్పటికీ హార్దిక్ పటేల్ చేసిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్ జరుగుతున్న ప్రాంతాలలో వైఫీ సిగ్నల్స్ పనిచేయకుండా జామర్స్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
తమ పార్టీ గుజరాత్ ఎన్నికలలో ఓడిపోవడం ఖాయం అని మహారాష్ట్ర భాజపా రాజ్యసభ సభ్యుడు సంజయ్ కాకడే చెప్పడం విశేషం. ఎలాగూ మరికొన్ని గంటలలోనే తుది ఫలితాలు వెలువడుతాయి కనుక ఎవరి అంచనాలు నిజమవుతాయో తేలిపోతుంది. కొద్ది సేపటి క్రితమే రెండు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది.