ఐదేళ్ళు గడిచాయి..నిర్భయ కేసు ఇంకా తేలలేదు

సరిగ్గా ఐదేళ్ళ క్రితం అంటే డిసెంబర్ 16, 2012వ తేదీన డిల్లీలో కదులుతున్న బస్సులో 23 ఏళ్ళ వయసున్న ఒక నర్సింగ్ విద్యార్ధినిపై ఆరుగురు మృగాళ్ళు సామూహిక అత్యాచారం చేసి, ఆమెపట్ల అతి కిరాతకంగా వ్యవహరించి రోడ్డుపక్కన పడేసి వెళ్ళిపోయారు. ఆమె ఆసుపత్రిలో 13 రోజులపాటు నరకం అనుభవించి చివరికి కన్నుమూసింది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు నిందితులను డిల్లీ పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టినప్పటికీ, ఐదేళ్ళు గడిచిపోయినా ఇంతవరకు ఆ కేసు ముగియలేదు. 

వారిలో రాజు అనే కుర్రాడు మైనర్ కావడంతో జువైనల్ హోంలో మూడేళ్ళు గడిపేసి శిక్ష నుంచి తప్పించుకోగలిగాడు. వారిలో రామ్ సింగ్ అనే వ్యక్తి తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకొన్నాడు. మిగిలిన నలుగురికి..ముఖేష్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ ఠాకూర్, వినయ్ గుప్తాలకు 2017, మే 5న సుప్రీం కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అప్పటి నుంచి వారి తరపున వాదిస్తున్న న్యాయవాదులు రకరకాల కారణాలతో ఆ కేసును ఇంతకాలం సాగదీయగలిగారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు (ఉరిశిక్ష)పై వారు మళ్ళీ రివ్యూ పిటిషన్ వేశారు. దానిపై 2018, జనవరి 22వ తేదీన విచారణ జరుగుతుంది. ఒకవేళ అప్పుడు కూడా సుప్రీం కోర్టు వారికి మరణశిక్షనే ఖరారు చేసినట్లయితే, ఆ తరువాత వారు క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి దరఖాస్తు చేసుకొంటారు. దానిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఎవరికీ తెలియదు.