మావోయిస్టు మాజీ నేత కోమళ్ళ శేషగిరిరావు అలియాస్ గోపన్న ఖాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకొన్నారు. ఆయన స్వస్థలంమహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు మండలంలోని వెలికట్టె గ్రామం. ఆయన జేబులో లభించిన సూసైడ్ లెటర్ లో వ్రాసిన దానిని బట్టి ఆర్ధిక సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
దానిలో ఆయన ఏమి వ్రాశారంటే, “మిత్రులారా దయచేసి క్షమించండి. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకండి. నా కూతురు, నా భార్య పరిస్థితి గురించి దయచేసి కాస్త ఆలోచించండి. కుటుంబసభ్యులారా.. నేను చాలా తప్పు చేశాను. నమ్మి మోసపోయాను. నా కుటుంబాన్ని దిక్కులేకుండా చేసిపోతున్నాను. తల్లీ..నన్ను క్షమించు. బిడ్డా...అమ్మను బాధపెట్టకు..అమ్మ అమాయకురాలు. స్వర్ణా! లవ్ యూ అండ్ ఐయాం మిస్సింగ్ యూ..నిన్ను కష్టపెట్టి ఉంటే నన్ను క్షమించు. ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదగగలడో..మళ్ళీ అంతలోనే ఎంత దిగజారగలడో తెలుసుకోవడానికి నా జీవితమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. చివరి నిమిషం వరకు నేను బతకాలనే అనుకున్నాను. కానీ, నేను ఇంకా అందరితో మాటలు పడలేను. నాతో ఎంతో సహాయం పొందిన వారు కూడా నన్ను నీచంగా చూస్తున్నారిప్పుడు. నా చావు వల్ల ఎక్కువ నష్టపోయేది నా భార్య...నా కూతురే. నా చిన్ని తల్లికి ఇక తండ్రి ఉండడు అంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇవ్వాళ్ళ పొద్దున్నే మన ఊరులో ఒకరు ఉరి పెట్టుకుంటే చూసి వచ్చాను. అయ్యో..ఎందుకిలా చేశాడా అనుకున్నాను.. కానీ ఇప్పుడు నేను చేస్తున్నదేమిటి? స్వర్ణా...జీవితంలో కొన్ని పొరపాట్లు చేసాను. కానీ నిన్ను ఎన్నడూ మోసం చేయలేదు. అన్నింటినీ క్షమించావు...కానీ నీకు నేను ఏమీ ఇవ్వలేక పోతున్నాను...ఇట్లు గోపన్న.”
గోపన్న వ్రాసిన ఈ లేఖను బట్టి అయన మావోయిస్టుగా పనిచేసి, ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించినప్పటికీ, చాలా సున్నిత మనస్కుడని అర్ధం అవుతోంది. ఆయన 1990-2005 వరకు మావోయిస్ట్ గా పనిచేశారు. ఆయన భార్య స్వర్ణక్క కూడా మావోయిస్టులలోనే ఉండేవారు. వారిద్దరూ 2005లో పోలీసులకు లొంగిపోయారు. అనంతరం వారిరువురూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వర్ణక్క తొర్రూర్ మండలంలో జెడ్పిటిసి ఎన్నికలపోటీ చేసి గెలిచారు. వారికి ఒక పాప ఉంది. మావోయిస్టులను వీడి ప్రజాజీవనంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగారు. కానీ దానిలో కొందరు ఆయనను నమ్మించి మోసం చేయడంతో తీవ్ర ఆర్ధికసమస్యలలో చిక్కుకొన్నారు. వేరే ఆదాయమార్గం లేకపోవడంతొ వాటి నుంచి ఏవిధంగా బయటపడాలో తెలియక, అప్పులవాళ్ళ సూటిపోటి మాటలు భరించలేక చివరకు ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని అయన లేఖలో వ్రాసినదానిని బట్టి అర్ధం అవుతోంది.