రాహుల్ గాంధీ మరికొద్ది సేపటిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కనుక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు చాలా హాడావుడి చేస్తున్నాయి. అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ కార్యాలయాల వద్ద బాజాబజంత్రీలు వాయిస్తూ, రంగులు చెల్లుకొంటూ కాంగ్రెస్ కార్యకర్తలు డ్యాన్సులు చేస్తున్నారు. నేతలందరూ ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల త్యాగాల గురించి మాట్లాడుతున్నారు. ఆ త్యాగాల వంశానికి చెందిన రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టడం శుభపరిణామమని చెపుతున్నారు.
కాంగ్రెస్ నేతల, కార్యకర్తల ఈ హడావుడి, మాటలు ఎలా ఉన్నప్పటికీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో నాయకత్వంపై ఉన్న సందిగ్దత తొలగిపోయినందుకు అందరూ సంతోషించవచ్చు. రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు ఉన్నాయో లేవో అనే సంగతి ఇక పార్టీ నేతలు ఎవరూ నిర్ణయించనవసరం లేదు. కాలమే నిర్ణయిస్తుంది. దానికీ ఎక్కువ కాలం వేచి చూడనవసరం లేదు. ఈ నెల 18వ తేదీనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. ఆ రెండు రాష్ట్రాలలో రాహుల్ గాంధీ సర్వం తానై ఎన్నికల ప్రచారం నిర్వహించారు కనుక ఆ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా, ఓడినా ఆ ‘క్రెడిట్’ ఆయన ఖాతాలోనే జమా అవుతుంది. కనుక మరో రెండు రోజులు ఆగితే చాలు అయన రాజకీయ శక్తిసామర్ధ్యాలకు ఫలితాలు వెలువడతాయి.