శుక్రవారం సాయంత్రం ఎల్.బి.స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతీప్రజ్వలనం చేసి ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభోపన్యాసం చేస్తూ, “ఎంతటివారికైనా అమ్మ ఒడే మొదటి బడి అవుతుంది. అమ్మపాడే లాలిపాటలతోనే మాతృబాష పరిచయం అవుతుంది. అదే ప్రతీ మనిషిలో సాహిత్యాభిరుచి కలుగడానికి నాంది అవుతుంది. నాకు కూడా చిన్నప్పుడు మా అమ్మ,నాన్న అనేక శతకాలలో పద్యాలు నేర్పించారు. అప్పటి నుంచే నాకు తెలుగు సాహిత్యం జీవితంలో భాగంగా మారిపోయింది. వయసు పెరుగుతున్న కొద్దీ మెల్లగా తెలంగాణా సాహిత్యం దాని గొప్పదనం తెలుసుకోగలిగాను. అద్భుతమైన సాహిత్యాన్ని పండించిన మాగాణం తెలంగాణా రాష్ట్రం. తెలంగాణా సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంత గొప్ప సాహిత్యం మనకు ఉంది. ఈ ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా అది లోకానికి మరోసారి పరిచయం అవుతుందని ఆశిస్తున్నాను. ఈ మహా సభలకు దేశంలో 17 రాష్ట్రాల నుంచి అనేకమంది తెలుగు పండితులు, సాహిత్యకారులు, కళాకారులు తరలివచ్చారు. 42 దేశాల నుంచి సుమారు 400 మంది బాషాభిమానులు తరలివచ్చారు. తెలుగు బాషపై మంచి పట్టు, దానిపై అపారమైన మమకారం కలిగిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు ఈ మహాసభలకు ముఖ్య అతిధిగా విచ్చేయడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. ఈ మహాసభలకు హాజరైన వారందరికీ శుభాభినందనలు,” అని కెసిఆర్ తన ప్రసంగం ముగించారు.
ఈరోజు మొదలైన ఈ కార్యక్రమాలకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జగదీష్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీలు బండారు దత్తాత్రేయ, జితేందర్‌రెడ్డి, కేశవరావు, అసదుద్దీన్ ఓవైసీ తదితరులు హాజరయ్యారు.