ట్రిపుల్ తలాక్ బిల్లుకు కేంద్రం ఆమోదముద్ర

ఈరోజు డిల్లీలో జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో వివాదాస్పదమైన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కనుక ఈ వివాహపు హక్కుల రక్షణ చట్టం, 2017 బిల్లును మోడీ సర్కార్ త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. దీనికి పార్లమెంటు ఆమోదం తెలిపి అమలులోకి వస్తే, ఇకపై వివాహిత ముస్లిం పురుషులు ఎవరూ మూడుసార్లు ‘తలాక్’ చెప్పినా అది చెల్లదు. పైగా నేరంగాపరిగణించబడుతుంది. ప్రత్యక్షంగా నోటితో గానీ, మొబైల్ ఫోన్, ఎస్.ఎం.ఎస్., వాట్స్ అప్ మెసేజ్ ల ద్వారా కానీ, మరేమాధ్యమం ద్వారా గానీ తలాక్ చెపితే చట్టప్రకారం చెల్లదు. ఆవిధంగా చేస్తే దానిని నేరంగా పరిగణించి మూడేళ్ళు జైలు శిక్ష కూడా విధించబడుతుంది.

ఈ చట్టం అమాలులోకి వచ్చిన తరువాత ఎవరైనా ఒక ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పి విడిపోతే ఆమె పోలీసులకు పిర్యాదు చేసినట్లయితే అతనిపై వెంటనే నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేస్తారు. అంతేకాదు ఆ మహిళ కోరినట్లయితే వారి పిల్లలను ఆమెకే తక్షణం అప్పగిస్తారు. జైలు శిక్షతో బాటు భార్యా, పిల్లల పోషణార్ధం భరణం కూడా చెల్లించవలసి ఉంటుంది. కనుక ఒకవేళ ఎవరైనా విడిపోదలిస్తే, చట్ట ప్రకారం న్యాయస్థానం ద్వారానే విడిపోవలసి ఉంటుంది.  

ఈ చట్టం ముస్లింల మత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని కొందరు మతపెద్దలు వాదిస్తున్నప్పటికీ, తలాక్ అనే సామాజిక జాడ్యం కారణంగా అర్ధాంతరంగా రోడ్డున పడి నానా కష్టాలు పడుతున్న ముస్లిం మహిళలు, వారిపైనే ఆధారపడిన పిల్లలకు ఇది చాలా రక్షణ కల్పిస్తుంది. 

కేంద్రప్రభుత్వం ఈ చట్టానికి ముసాయిదా తీర్మానం కాపీలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి దానిపై డిసెంబర్ 10 లోగా అభిప్రాయాలు తెలుపవలసిందిగా కోరింది. ఇంతవరకు అస్సాం, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దానికి సంపూర్ణ మద్దతు తెలిపాయి. ఆంధ్రా, తెలంగాణాతో సహా అనేక రాష్ట్రాలు ఇంకా తమ అభిప్రాయం తెలుపవలసి ఉంది. రాష్ట్రాలు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించినట్లయితే చట్టంగా అమలులోకి వస్తుంది. అయితే పార్లమెంటులో వివిధపార్టీల  సభ్యులు, ముఖ్యంగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల సభ్యులు దీనిని అంగీకరించకపోవచ్చు.