తూచ్..సోనియా రాజకీయాలలో కొనసాగుతారు!

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ శనివారం బాధ్యతలు చేపట్టబోతున్నారు. కనుక రేపు సోనియా గాంధీ తన పదవిలో నుంచి తప్పుకోబోతున్నారు. ఈరోజు పార్లమెంటు సమావేశాలకు హాజరైనప్పుడు ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ ‘నేను ఇక రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనుకొంటున్నానని’ స్పష్టంగా చెప్పారు. కానీ కొద్దిసేపటికే కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా సవరణ ప్రకటన చేశారు. “సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి మాత్రమే తప్పుకొంటున్నారు తప్ప రాజకీయాల నుంచి కాదు. ఆమె సలహాలు, సూచనలు, ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి చాలా అవసరం ఉన్నాయి,” అని ట్వీట్ చేశారు.

గత కొంతకాలంగా సోనియా గాంధీ తరచూ ఏదో ఒక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కనుక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకోవాలనుకోవడం సహజమే. అయితే ఆమె రాయ్ బరేలీ ఎంపిగా ఉన్నారు. కనుక ఆ పదవీకాలం ముగిసేవరకు రాజకీయాలలో కొనసాగి తరువాత రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవచ్చు.