నేటి నుంచే తెలుగు పండుగ

నేటి నుంచే హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కాబోతున్నాయి. సుమారు 42 ఏళ్ళ క్రితం అంటే  1975లో హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. మళ్ళీ ఇన్నేళ్ళకు తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా జరుగుతున్నాయి. కనుక ఈ మహాసభలలో తెలంగాణా రాష్ట్ర సాహిత్యం, కళలు, కవులు, కళాకారుల గురించి ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణాకు చెందిన ఎందరో మహాకవులు, రచయితల రచనలను మళ్ళీ ముద్రించి ఈ మహాసభలలో అందరికీ అందుబాటులో పెడుతోంది. గత మూడున్నరేళ్ళుగా మరుగునపడిన కళలను గుర్తించి మళ్ళీ వాటికి జీవం పోసినందున, ఆ కళాకారుల ప్రదర్శనలను ఏర్పాటు చేసింది. ఈరోజు సాయంత్రం 5.30గంటలకు ఎల్.బి.స్టేడియంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డిగారి ప్రారంభోపన్యాసంతో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం అవుతాయి. ఆ తరువాత సభాధ్యక్షులుగా విచ్చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగిస్తారు. ఈ మహాసభల ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. 

ఈరోజు కార్యక్రమాల వివరాలు: 

సాయంత్రం 5.30 గంటలకు: మహాసభలు ప్రారంభం.

సాయంత్రం 6.00 గంటలకు: సాంస్కృతిక సమావేశం. దీనిలో జ్ఞాన పీఠ్‌ అవార్డు గ్రహితలు ప్రతిభా రే, సీతాకాంత్‌ మహాపాత్ర, సత్యవ్రత్‌ శాస్త్రి, మంత్రి హరీష్ రావు, మాడభూషి సంపత్ కుమార్, డాక్టర్ ఎస్వీ సత్యనారాయణ పాల్గొంటారు.

సాయంత్రం 6.30 గంటలకు: డాక్టర్ రాజారెడ్డి-డాక్టర్ రాధారెడ్డిల మన తెలంగాణా-సంగీత నృత్య రూపకం ప్రదర్శన.

సాయంత్రం 7.00 గంటలకు: శ్రీరామాచారి బృందం పాట కచేరి

సాయంత్రం 7.30 నుంచి 9.00 గంటల వరకు: దేశపతి శ్రీనివాస్ రచించిన జయోస్తు జయోస్తు తెలంగాణా సంగీత నృత్య రూపక ప్రదర్శన ఉంటాయి.