ఇటువంటి సంఘటనలు చూసినవారు ‘ఇట్ కెన్ హాపెన్ ఓన్లీ ఇన్ ఇండియా’ అని పాడుకొంటారేమో? ఈ విచిత్రమైన సంఘటన డిల్లీ విమానాశ్రయంలో జరిగింది.
నిన్న ఉదయం 6 గంటలకు డిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం గన్నవరం బయలుదేరవలసి ఉంది. ఎప్పుడూ సాధారణ ప్రయాణికుడిలాగే ప్రయాణించే అలవాటున్న పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కూడా అదే విమానంలో ఉన్నారు. ఆయనతో సహా ప్రయాణికులు అందరూ సెక్యూరిటీ చెక్ లు పూర్తి చేసుకొని విమానంలో తమతమ సీట్లలో కూర్చొన్నారు. కానీ విశేషమేమిటంటే, ఆ విమానంలో సేవలు అందించాల్సిన ఎయిర్ హోస్టెస్ లు, ఆ విమానం నడుపవలసిన పైలట్లు మాత్రం రాలేదు.
మంత్రిగారితో సహా ప్రయాణికులు అందరూ వారికోసం ఎదురు చూస్తూ గంటసేపు విమానంలో కూర్చొన్నారు. కానీ వారు ఎంతకీ రాకపోవడం మంత్రిగారికి కోపం వచ్చి ఎయిర్ ఇండియా చీఫ్ ప్రదీప్ ఖరోలాకు ఫోన్ చేసి నిలదీశారు.
ఆ సమయంలో మంచు ఎక్కువగా కురుస్తున్నందున విమానం ఆలస్యంగా బయలుదేరతీయాలని సంబంధిత అధికారులు నిర్ణయించారని, అయితే వారు ఆ విషయం గ్రౌండ్ స్టాఫ్ కు చెప్పకపోవడంతో వారు యధాప్రకారం ప్రయాణికులకు సెక్యూరిటీ చెక్స్ నిర్వహించి విమానంలోకి పంపించేశారని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని ప్రదీప్ ఖరోలా మంత్రిగారి చెవిలో చల్లగా చెప్పారు. విమానం బయలుదేరడంలో ఆలస్యమవుతుందని గ్రౌండ్ స్టాఫ్ కు సమాచారం అందించవలసిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
తమ విమానంలో సాక్షాత్ పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రయాణిస్తున్నారనే ఇంగితజ్ఞానం కూడా లేకుండా ఎయిర్ ఇండియా అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తుంటే ఆ సంస్థ ఎందుకు ఎప్పుడూ నష్టాలలో కూరుకుపోతోందో అర్ధం చేసుకోవచ్చు.