మేడారంలో సమ్మక్క సారక్క ట్రస్ట్ బోర్డులో లంబాడీలకు సభ్యులుగా అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూ వందలాది ఆదివాసిలు వచ్చి నిరసనలు తెలియజేయడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆదివాసీలు అడ్డుకొనే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేసి చెదరగొట్టాఋ. దాంతో ఆదివాసీలు ఆగ్రహంతో రెచ్చిపోయి అక్కడే ఉన్న కార్లపై రాళ్ళతొ దాడి చేశారు. వారి దాడిలో మొత్తం 15 కార్ల అద్దాలు పగిలిపోయాయి. అక్కడి నుంచి కూడా పోలీసులు వారిని చెదరగొట్టడంతో ఆదివాసీలు అక్కడి నుంచి మేడారంలోని ఐటిడిఏ కార్యాలయానికి చేరుకొని లోపలకు ప్రవేశించి ఫర్నీచర్, రికార్డులకు నిప్పు పెట్టి విద్వంసం సృష్టించారు. ములుగు డిఎస్పి రాఘవేంద్ర రెడ్డి అక్కడకు చేరుకొని ఆదివాసి నేతలతో చర్చలు జరుపుతున్నారు.
ఎప్పుడూ ప్రశాంతంగా జీవించే ఈ రెండు వర్గాలు హటాత్తుగా ఘర్షణ పడటం వెనుక ఎవరైనా రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలు ఉన్నాయా? అసలు ఏ కారణం చేత వారు ఘర్షణపడుతున్నారనే విషయాలు తెలుసుకొని వారి సమస్యలను తక్షణం పరిష్కరించడం చాలా అవసరం. వారి మద్య మొదలైన ఈ విభేదాలను ప్రభుత్వం ఇప్పుడే పరిష్కరించే ప్రయత్నం చేయకపోతే మున్ముందు ఇది పెను సమస్యగా మారే ప్రమాదం ఉంది. అప్పుడు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నా ఏమి ప్రయోజనం ఉండదు.