తెరాస ఎమ్మెల్సీపై సస్పెన్షన్ వేటు?

నిజామాబాద్ తెరాస ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ పార్టీ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కారణంగా పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించినట్లు సమాచారం.  

మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో బుధవారం జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యి ఈ సమస్యపై చర్చించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలని కోరుతూ జిల్లా ఇన్-ఛార్జ్ తుల ఉమకు వారు ఒక లేఖ ఇవ్వగా, ఆమె దానిని నిన్ననే ముఖ్యమంత్రి కెసిఆర్ కు అందజేశారు. 

ఆర్ధోపెడిక్ వైద్యుడైన డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి మొదటి నుంచి తెరాసలోనే ఉన్నారు. కనుక 2014 ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకొన్నారు. కానీ అదేసమయంలో వైకాపా నుంచి వచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్ కు టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తి చెందారు. అప్పటి నుంచే ఆయనకు, బాజిరెడ్డికి మద్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా కలుగజేసుకొని భూపతిరెడ్డికి నచ్చజెప్పి 2016లో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టికెట్ ఇవ్వగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ చిరకాలంగా పార్టీకి సేవలు అందిస్తున్న తనకు కాదని కొత్తగా వచ్చిన బాజిరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు భూపతిరెడ్డి ఆగ్రహంగానే ఉన్నారు. ఆ కారణంగా బాజిరెడ్డితో తరచూ గొడవపడుతుండేవారు. జిల్లా మంత్రులు, ఎంపి కవిత, పార్టీ నేతలు ఆయనకు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ బాజిరెడ్డిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వారి మద్య విభేదాలు పతాకస్థాయికి చేరుకోవడంతో భూపతిరెడ్డి కాంగ్రెస్, భాజపా నేతలతో చర్చలు మొదలుపెట్టారు. కనుక అయన పార్టీపై ఆసక్తి కోల్పోయారని గ్రహించిన తెరాస నేతలు, ఆయనను పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలని కోరుతూ లేఖ ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించే అవకాశం ఉంది.