కాంగ్రెస్, భాజపాలకు అత్యంత కీలకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో మలిదశ పోలింగ్ మరికొద్ది సేపటిలో మొదలవబోతోంది. ఈరోజు 14 జిల్లాలలో 93 స్థానాలకు జరుగుతున్న ఎన్నికలలో మొత్తం 851 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఇవ్వాళ్ళ మొత్తం 2.2 కోట్లు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వారిలో ప్రధాని నరేంద్ర మోడీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, భాజపా సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ వంటి హేమాహేమీలు కూడా ఉన్నారు. ఈ మలిదశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం మొత్తం 25,575 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఈ మలిదశ పోలింగ్ చాలా నిర్ణయాత్మకమైనది కావడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బారీగా భద్రతాదళాలు మొహరించబడ్డాయి.
ఈరోజు పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాలలో పటేదార్ (పటేల్ కులస్తులు) జనాభా శాతం ఎక్కువగా ఉన్నారు. వారి యువనాయకుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినందున వారు కాంగ్రెస్, భాజపాలలో దేనికి ఓట్లు వేస్తారో చూడాలి.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 50 శాతం గరిష్టపరిమితికి మించి రిజర్వేషన్లు పెంచడం సాధ్యం కాదని తెలిసి కూడా పటేల్ కులస్తులకు రిజర్వేషన్లు పెంచుతామని హార్దిక్ పటేల్, రాహుల్ గాంధీ మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వాదనలో నిజం ఉందని వారు గ్రహిస్తే మళ్ళీ భాజపాకే ఓట్లు వేయవచ్చు. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడమే కాకుండా హార్దిక్ పటేల్ రాజకీయ పతనం కూడా ప్రారంభం అయినట్లే భావించవచ్చు.
ఇక నోట్ల రద్దు, జి.ఎస్.టి.లతో వరుస దెబ్బలు తిన్న గుజరాత్ (వ్యాపారులు) ఓటర్లు మోడీపై ప్రతీకారం తీర్చుకొనేందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా లేక భాజపాకే మళ్ళీ పట్టం కట్టి మోడీ నిర్ణయాలను సమర్ధిస్తారా అనే విషయం ఈ నెల 18న ఫలితాలు వెలువడినప్పుడు తేలిపోతుంది.