తెలుగు మహాసభలకు అట్టహాసంగా ఏర్పాట్లు

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగబోతునందున, దశాబ్దాలుగా తీవ్ర వివక్షకు, నిరాధారణకు గురైన తెలంగాణా సాహిత్యం, కళలు, సంస్కృతీ సంప్రదాయాలు, తెలంగాణా పండుగలు వాటి విశిష్టత, రాష్ట్రంలో చారిత్రిక ప్రదేశాల గొప్పదనాన్ని ఈ మహాసభలలో చాటి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది. అదేవిధంగా సమైక్య రాష్ట్రంలో గుర్తింపుకు నోచుకోక మరుగునపడిన గొప్ప కవులు, సాహిత్యకారులు, కళాకారులు, వారి రచనలు, కళల గురించి కూడా ఈ మహాసభలలో ప్రపంచానికి చాటిచెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది.ఈ మహాసభలకు విచ్చేస్తున్న వారందరికీ తెలంగాణా వంటల రుచులను పరిచయం చేయబోతోంది.

ఇప్పటికే నగరమంతా తెలుగుదనం సంతరించుకొంది. ఈ మహా సభలు జరుగబోయే ఎల్.బి. స్టేడియం, లలిత కళాతోరణం, తెలుగు విశ్వవిద్యాలయం, రవీంద్ర భారతి, తెలంగాణా సారస్వత పరిషత్ హాల్ తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణాకు చెందిన అలనాటి మహాకవులు, సాహిత్యవేత్తలు, కళాకారుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ బ్యానర్లు తెలంగాణా గొప్పదనాన్ని చాటి చెపుతూ కనువిందు చేస్తున్నాయి. 

ఈ మహాసభలకు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. వారికోసం అధికారులు వసతి, రవాణా, భోజన సదుపాయాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహాసభల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ వస్తున్నారు కనుక అయన కోసం వేరేగా అధనపు భద్రతాఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు జరిగిన కొద్ది రోజులకే ఈ మహాసభలు జరుగుతున్నందున, అప్పటి నుంచి అధికారులు క్షణం తీరికలేకుండా ఉరుకుల పరుగుల మీద పనులు చేయవలసి వస్తోంది. డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఈ తెలుగు మహాసభలు జరుగబోతున్నాయి.