టిటిడిపిలో మరో వికెట్ పడింది

టిటిడిపిలో మరో వికెట్ పడింది. నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత ఉమామాధవ్ రెడ్డి తన కుమారుడు సందీప్ రెడ్డితొ కలిసి ప్రగతి భవన్ కు వెళ్ళి ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసి పార్టీలో చేరాలనుకొంటున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించడంతో గురువారం ఆమె తన కుమారుడు, అనుచరులతో కలిసి ఆయన సమక్షంలోనే తెరాసలో చేరే అవకాశం ఉంది. ఆమె మొదట కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొన్నప్పటికీ తన అనుచరులు సన్నిహితులలో చాలా మంది తెరాసలో ఉన్నందున తెరాస వైపు మొగ్గు చూపారు. 

జిల్లాలో మరో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులతో భేదాభిప్రాయాల కారణంగా ఆమె గత కొంత కాలంగా తెదేపా వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అదీగాక నయీం కేసులో ఆమెపై ఆరోపణలు వచ్చినప్పుడు జిల్లా నేతలు ఎవరూ ఆమెకు అండగా నిలబడకపోవడం చేత ఆమె క్రమంగా పార్టీకి దూరం అయ్యారు. అయితే మోత్కుపల్లి నరసింహులు మళ్ళీ జిల్లా రాజకీయాలలో యాక్టివ్ అయ్యారు కనుక ఆమె వెళ్ళిపోయినా టిటిడిపికి కొత్తగా వచ్చే నష్టమేమీ లేదనే చెప్పవచ్చు.