ఉస్మానియా యూనివర్సిటీలో మురళి అనే పిజి విద్యార్ధి నిన్న ఉదయం ఆత్మహత్య చేసుకోవడంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. యూనివర్సిటీలో విద్యార్ధులు ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేయడం, వైస్ ఛాన్సిలర్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేయడంతో పోలీసులు రంగ ప్రవేశంచేసి లాఠీలకు పని కల్పించక తప్పలేదు. కొందరు విద్యార్ధులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించినప్పటికీ యూనివర్సిటీలో ఇంకా ఉద్రిక్తవాతారణమే నెలకొని ఉంది.
ఈ ఘటనలపై స్పందించిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, “ఒకప్పుడు అదే యూనివర్సిటీ విద్యార్ధులను కెసిఆర్ తెలంగాణా సాధన కోసం ఉపయోగించుకొన్నారు. ఇప్పుడు అదే విద్యార్ధులను పోలీసుల చేత కొట్టించి అరెస్ట్ చేయిస్తున్నారు. అయనకు వ్యతిరేకంగా గళం ఎత్తిన విద్యార్ధులను, మీడియాను, తెలంగాణా సాధన కోసం పోరాడిన వారిని టార్గెట్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులపై పోలీసులు దాడి చేయడమే అందుకు తాజా ఉదాహరణ. అరెస్ట్ చేసిన విద్యార్ధులను తక్షణమే విడిచిపెట్టి, వారిని అరెస్ట్ చేసిన పోలీసులపై కటిన చర్యలు తీసుకోవాలి,” అని అన్నారు.