26 ఇయర్స్ ఇండస్ట్రీ: పూరీ జగన్నాథ్

దర్శకుడు పూరీ జగన్నాధ్ సినీ పరిశ్రమలోకి వచ్చి26 ఏళ్ళయింది. ఈ రెండున్నర దశాబ్దాలలో అనేక సూపర్ హిట్ సినిమాలు, లైగర్ వంటి అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా చేశారు. ఒకటి రెండు  సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన్న ఎవరి ప్రతిభ తగ్గిపోదు. కాస్త నిరాశ కలుగుతుంది కానీ ప్రతిభ అలాగే ఉంటుంది. దానిని అందరూ గుర్తించగలరు.

పూరీ జగన్నాధ్ సినీ పరిశ్రమలోకి వచ్చి26 ఏళ్ళయిన సందర్భంగా ఆయనతో కలిసి ‘స్లమ్‌ డాగ్’-33 టెంపుల్ రోడ్’ సినిమా చేస్తున్న కోలీవుడ్‌ నటుడు విజయ్ సేతుపతి, ఆయనని అభినందిస్తూ, “ఈ మనిషి ప్రయాణం నిజంగా ఎంత అద్భుతమో! సినిమా రంగంలో 26 సంవత్సరాలు అనేది కేవలం ఒక మైలురాయి కాదు… ధైర్యం, నమ్మకం, నిర్భయమైన స్వరంతో నిర్మించిన ఒక వారసత్వం.

ప్రియమైన పూరి సర్,  ‘స్లమ్‌ డాగ్’-33 టెంపుల్ రోడ్’ సినిమాలో మీతో కలిసి పనిచేయడం నిజంగా గొప్ప అనుభవం. నటులమై మనం ఎప్పుడూ మనపై నమ్మకం ఉంచి, మన కంఫర్ట్ జోన్ దాటేలా ప్రోత్సహించే దర్శకులను కోరుకుంటాం… మీరు అది ఎంతో సులభంగా చేస్తారు.

ఈ సినిమా మన అందరికీ ఎంతో ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని నేను నమ్ముతున్నాను. మీరు మరింత విజయాలు సాధిస్తూ, ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రభావవంతమైన కథలను అందించాలని కోరుకుంటున్నాను. ఎప్పటికీ గౌరవం,” అని విజయ్‌ సేతుపతి ట్వీట్‌ చేశారు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి బిచ్చగాడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో  విజయ్ సేతుపతి, విజయ్‌ కుమార్‌, టబు, రాధిక ఆప్టే, సంయుక్త, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

పూరీ, ఛార్మీలు తమ సొంత బ్యానర్ ‘పూరీ కనెక్ట్స్’తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తీస్తున్న ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా పాటలు, టీజర్‌, ట్రైలర్‌ వరుసగా విడుదల కాబోతున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.