13.jpg)
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌కు సిట్ అధికారులు శుక్రవారం రాత్రి మరోసారి సీఆర్పీ సెక్షన్ 160 ప్రకారం నోటీస్ ఇచ్చారు. రేపు (అదివారం) మధ్యాహ్నం 3 గంటలకు బంజారా హిల్స్‌లోని నందినగర్ నివాసంలోనే విచారణ జరుపుతామని దానిలో పేర్కొన్నారు.
కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్, శాసనసభకు సమర్పించిన వివరాలలో ఇదే చిరునామా ఉంది కనుక ఇక్కడే విచారణ జరుపుతామని ఎర్రవల్లి ఫామ్‌హౌసులో కుదరదని నోటీసులో స్పష్టం చేశారు. కనుక రేపు మధ్యాహ్నం 3 గంటలకు తప్పనిసరిగా నందినగర్ నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని సూచించారు.
శుక్రవారం సాయంత్రమే కేసీఆర్ తన ఫామ్‌హౌసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలతో సమావేశమై సిట్ విచారణ గురించి చర్చించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసి ఎన్నికల ప్రచారం మొదలైంది కనుక పార్టీ వ్యూహాల గురించి చర్చించారు.