
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీణవంకలో జరిగిన దానికి పోలీసులకు క్షమాపణ చెప్పారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ కించపరిచాలని అలా అనలేదని, క్షణికావేశంలో మాట తూలానని చెప్పారు. తన మాటలతో పోలీసుల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని విజ్ఞప్తి చేశారు.
తాను కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన వీణవంకలో వనదేవతలను దర్శించుకోవడానికి వెళుతుంటే పోలీసులు తమని అడ్డుకోవడం సరికాదన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల ఒత్తిడి కారణంగానే పోలీసులు తమని అడ్డుకుంటున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే, గురువారం రాత్రి వీణవంకలో సమ్మక్క సారలమ్మలమ్మ ఆలయంలో దళిత సర్పంచ్ సరోజని కొబ్బరికాయ కొట్టనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అందుకు నిరసనగా పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైటాయించి నిరరసన తెలిపారు.
ఆ తర్వాత వారు సారలమ్మని దర్శించుకొని సమ్మక్క గద్దె చేరిన తర్వాత ఆమెను దర్శించుకునేందుకు గద్దెల వద్ద వేచి చూస్తున్నారు. సమ్మక్కని గద్దెకి చేర్చిన తర్వాత మొట్ట మొదట తామే కొబ్బరికాయ కొట్టాలని పాడి కౌశిక్ రెడ్డి పట్టుబట్టారు.
కానీ అంతసేపు అక్కడ వారుంటే మిగిలిన భక్తులకు ఇబ్బంది అవుతుంది కనుక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని పోలీస్ అధికారులు కోరారు. కానీ వారు వినకపోవడంతో బలవంతంగా గద్దెల నుంచి కిందకు దించేశారు.
ఈ సందర్భంగా వారిమధ్య తోపులాట జరిగినప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహావేశాలతో ఊగిపోతూ “ఈరోజు మీరు ముగ్గురూ నన్ను చొక్కా పట్టుకొని ఎలా ఈడ్చేశారో రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు అలాగే చేస్తానని బెదిరించారు.
దీంతో పోలీసులు ఆయనని అదుపులోకి తీసుకొని సైదాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులని దూషించినందుకు, చెయ్యి చేసుకున్నందుకు, బెదిరించినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు.
అప్పుడు గానీ పాడి కౌశిక్ రెడ్డి చల్లబడలేదు. పోలీస్ అధికారులకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు.