విచారణ ఎక్కడ జరపాలో ఛాయిస్ కేసీఆర్‌కే

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో సిట్ అధికారులు నేడు మాజీ సిఎం కేసీఆర్‌కి నోటీస్ ఇచ్చారు. కేసీఆర్‌ వయసు, ఆరోగ్య రీత్యా హైదరాబాద్‌ పరిధిలో అయన అనుకూలంగా ఉన్నచోటే శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి విచారణ జరుపుతామని సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. బహుశః నందీ నగర్‌లో తన నివాసంలోనే విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. 

కేసీఆర్‌కి సిట్ నోటీస్ ఇవ్వడంపై బీఆర్ఎస్‌ పార్టీ ఊహించినట్లే ఖండిస్తూ సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టింది. తెలంగాణ సాధించి అభివృద్ధి చేసిన కేసీఆర్‌పై తప్పుడు కేసులో నోటీస్ ఇవ్వడాన్ని బీఆర్ఎస్‌ పార్టీ తప్పు పట్టింది. 

"చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో– తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు.

సాధించిన తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు.
సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్ గారు.

అలాంటి నాయకుడికి అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం…
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైంది.

తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్ గారిపై నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం.

ఇది విచారణ కాదు…
ఇది ప్రతీకారం.
ఇది న్యాయం కాదు…
ఇది రాజకీయ దురుద్దేశం.

కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు.
నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరు.
తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
బీఆర్‌ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోంది.

ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తాం.తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు…
ప్రజల తీర్పుతోనే రాస్తారు," అని కేటీఆర్ ట్వీట్ చేశారు.