అత్యవసర ల్యాండింగ్‌కి ప్రయత్నించినా...

ఈరోజు ఉదయం మహారాష్ట్ర, పూణే జిల్లాలోని బారామతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో సహా నలుగురు చనిపోయారు. ఈరోజు ఉదయం ముంబాయి నుంచి 8.10 గంటలకు బయలుదేరిన వారి విమానం 8.30 గంటలకు బారామతి చేరుకుంది.

కానీ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ల్యాండింగ్ చేయలేకపోయారు. దాంతో రెండోసారి 8.42 గంటలకు అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించారు. కానీ విమానం అదుపు తప్పి బండరాయిని గుద్దుకొని పెద్ద శబ్దంతో పేలిపోయింది. రెండు ముక్కలైంది. ఆ ధాటికి ఇద్దరు ఎగిరి దూరంగా పడ్డారు.

ప్రమాదం జరిగినప్పుడు ముందుగా స్థానికులు అక్కడకు చేరుకొని విమానంలో ఉన్నవారిని బయటకు లాగి రక్షించే ప్రయత్నం చేశారు. కానీ వారు అప్పటికే చనిపోయారు. అజిత్ పవార్ సన్నిహితులు ఆయన చేతి వాచి, కళ్ళద్దాలను బట్టి ఆయన మృతదేహాన్ని గుర్తుపట్టారు. 

ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మహారాష్ట్ర సిఎం దేవంద్ర ఫడ్నవీస్, మంత్రివర్గ సహచరులు, బిజేపి నేతలు అజిత్ పవార్ మృతికి సంతాపం తెలియజేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.