సెక్స్ వివాదంలో ఎమ్మెల్యే.. పాపం జనసేన!

పవన్ కళ్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి అనేక సమస్యలు, సవాళ్ళు, అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ నిబ్బరంగా నిలబడి పోరాడుతూ పార్టీని తొలిసారిగా ఏపీలో అధికారంలోకి తెచ్చుకున్నారు. కానీ రెండేళ్ళు తిరక్క ముందే పార్టీలో నేతలు హత్య, అత్యాచారం, భూకబ్జాల వివాదంలో పార్టీకి, అధినేత పవన్ కళ్యాణ్‌ చెడ్డపేరు తెస్తున్నారు. 

తాజాగా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరం శ్రీధర్ తనను బెదిరించి, భయపెట్టి బలవంతంగా లోబరుచుకున్నారని ఓ ఒంటరి మహిళ బయటపెట్టింది. తనకు తల్లితండ్రులు, భర్త ఎవరూ లేకపోవడంతో బలవంతంగా లోబరుచుకున్నాడని ఆ యువతి ఆరోపించింది. అతని వలన ఏడాదిన్నరలో 5సార్లు అబార్షన్ కూడా చేయించుకున్నానని ఆమె మరో సంచలన విషయం బయటపెట్టింది. వారిరువురూ సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన వీడియోని ఆమె సోషల్ మీడియాలో విడుదల చేయగా అది వైరల్ అయ్యింది. 

ఆమె ఆరోపణలను, ఆ వీడియోని ఎమ్మెల్యే శ్రీధర్ ఖండించారు. నిజానికి తానే ఆమె బాధితుడునని రూ.25 కోట్లు ఇవ్వాలని తనని, తన తల్లిని చాలా ఒత్తిడి చేస్తూ నరకం చూపిందని ఎమ్మెల్యే శ్రీధర్ అన్నారు. అది డీప్ ఫేక్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేసిన మార్ఫ్ వీడియో అని శ్రీధర్ ఆరోపించారు.

ఆయనకు మద్దతుగా జనసేనలో ఒకరిద్దరు నేతలు మీడియా ముందుకు వచ్చి, ఆమెపై గతంలోనే తిరుపతి, బాపట్ల పలు ప్రాంతాలలో పోలీస్ కేసులు నమోదయ్యాయంటూ ఎఫ్ఐఆర్ కాపీలు చూపించి ఆమె ఒక మాయలాడి అని వాదించారు.

ఇందుకు జవాబుగా ఆమె మరికొన్ని వీడియోలు, ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో విడుదల చేస్తూ, ఎమ్మెల్యే శ్రీధర్ అధికార పార్టీకి చెందినవారు కనుక తాను పోలీసులకు పిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మొత్తం మీద ఈ సెక్స్ టేపుల వ్యవహారంతో జనసేన పార్టీ, దాని అధినేత పవన్ కళ్యాణ్‌ పరువు పోతోంది.