పార్టీ వీడినా మనసంతా నువ్వే: అరూరి రమేష్

బీఆర్ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ మళ్ళీ బీఆర్ఎస్‌ పార్టీ గూటికి చేరుకున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ సమక్షంలో అయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు మూడు పార్టీలకు కనువిప్పు కలిగిస్తే, ఏ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించదు. 

“వరంగల్‌ జిల్లాలో అనేకమంది బీఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు జీవితాలు నాశనం చేసిన వ్యక్తి కడియం శ్రీహరి. అయన బీఆర్ఎస్‌ అధిష్టానానికి మా అందరి గురించి తప్పుగా చెపుతూ ఒకరొకరిగా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయేలా చేశారు. అయన ముందుగానే సిఎం రేవంత్ రెడ్డితో అన్నీ మాట్లాడుకొని ఓ పధకం ప్రకారం వరంగల్లో బీఆర్ఎస్‌ పార్టీని నాశనం చేశారు. ఆ పధకంలో భాగంగానే తాను, తన కూతురు ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నికవగానే బీఆర్ఎస్‌ పార్టీని వీడి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్ళిపోయారు. 

అలాంటి పాపాత్ముడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు కనుకనే నేను మళ్ళీ నా సొంత గూటికి చేరుకున్నాను. నేను అయిష్టంగానే బీఆర్ఎస్‌ పార్టీని వీడి బిజేపిలో చేరినప్పటికీ నా మనసులో కేసీఆర్‌ అంటే చాలా గౌరవం ఉంది. అందువల్లే ఆయన గురించి కానీ పార్టీలో ఇతర నేతల గురించి గానీ ఎన్నడూ ఒక్క విమర్శ చేయలేదు. ఈ విషయాలన్నీ బీఆర్ఎస్‌ పార్టీలో అందరికీ తెలుసు. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ సొంత గూటికి చేరుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది,” అని అరూరి రమేష్ అన్నారు.