దానంకు స్పీకర్ నోటీస్ జారీ

ఖైరతాబాద్ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ నోటీస్ జారీ చేశారు. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో ఈ నెల 30న తన ముందు హాజరయ్యి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్‌ని కోరిన బీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కూడా అదే రోజున విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీస్ జారీ చేశారు. 

బీఆర్ఎస్‌ పార్టీ నుంచి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించగా వారిలో దానం నాగేందర్‌ , కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ తప్ప మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు సాంకేతికంగా నేటికీ బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నట్లు స్పీకర్ నిర్ధారించి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కడియం శ్రీహరి కూడా తాను బీఆర్ఎస్‌ పార్టీలోనే ఉన్నానని చెప్పారు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ని ఆదేశించాలని కోరుతూ బీఆర్ఎస్‌ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా తగు చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ని ఆదేశించింది. కానీ అయన సుప్రీంకోర్టుని మరో మూడు నెలలు గడువు కోరారు.

ఆ గడువు ముగుస్తుండటంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని లేకుంటే కోర్టు ధిక్కారం కేసు నమోదు చేయాల్సివస్తుందని సుప్రీంకోర్టు జనవరి 19న స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు నోటీస్ పంపినట్లు సమాచారం.